Gujarat Elections: సద్దాంను తలపిస్తున్న రాహుల్... అసోం సీఎం విసుర్లు

ABN , First Publish Date - 2022-11-23T14:53:00+05:30 IST

భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఛలోక్తులు విసిరారు. సద్దాం హుస్సేన్ పోలికల్లో..

Gujarat Elections: సద్దాంను తలపిస్తున్న రాహుల్... అసోం సీఎం విసుర్లు

అహ్మదాబాద్: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) ఛలోక్తులు విసిరారు. సద్దాం హుస్సేన్ (Saddam Hussain) పోలికల్లో రాహుల్ కనిపిస్తున్నారని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో ఆయన ఈ కామెంట్లు చేశారు.

గుజరాత్ ఎన్నికల వేళ రాహుల్ పర్యటించనున్నారా అనే ప్రశ్నకు ''గుజరాత్‌లో ఆయన కనిపించడం లేదు. విజిటింగ్ ఫాకల్టీ తరహాలోనే ఆయన రాష్ట్రానికి వస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. ఆయన ఎన్నికలు లేని ప్రాంతాల్లో మాత్రమే పర్యటిస్తుంటారు. బహుశా ఓటమి భయం కావచ్చు'' అని శర్మ సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు పెయిడ్ ఆర్టిస్టులుగా బాలీవుడ్ స్టార్స్‌ను తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

శర్మకు అసోం కాంగ్రెస్ కౌంటర్..

రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపెన్ కుమార్ బోరా తిప్పికొట్టారు. ''మీరు (అసోం సీఎం) కేవలం వార్తల్లో ఉండాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ పేరు ఎత్తితేనే అది సాధ్యమవుతుంది. హిమంత్ బిశ్వ శర్మ ఏదైనా మాట్లాడతారు. అధికారం కోసం ఏదైనా చేస్తారు. ఆయనను మేము పట్టించుకోం'' అని బోరా అన్నారు.

Updated Date - 2022-11-23T14:53:00+05:30 IST

Read more