Gujarat Results : సరికొత్త రికార్డు : రాజ్‌నాథ్ సింగ్
ABN , First Publish Date - 2022-12-08T11:54:13+05:30 IST
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ సీనియర్ నేత, రక్షణ మంత్రి
గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ సీనియర్ నేత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) హర్షం వ్యక్తం చేశారు. ఇది సరికొత్త రికార్డు అని తెలిపారు. గుజరాత్ ప్రజల్లో ప్రభుత్వ అనుకూలత ఉందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై రాష్ట్ర ప్రజలకు అమితమైన నమ్మకం ఉందన్నారు.
బీజేపీ (BJP) వరుసగా ఏడోసారి విజయం సాధించి, పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం సాధించిన రికార్డును సమం చేయబోతోంది. 182 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 155 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 17, ఆప్ తొమ్మిది, ఇతరులు నాలుగు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో పోల్ అయిన ఓట్లను గురువారం ఉదయం 8 గంటల నుంచి లెక్కిస్తున్నారు.
బీజేపీ నేత, గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘవి ఇచ్చిన ట్వీట్‌లో, జోష్ ఎలా ఉందని ప్రశ్నిస్తూ హర్షం వ్యక్తం చేశారు. జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రివబ జడేజా (క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి) ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్ కన్నా వెనుకంజలో ఉన్నారు. ఆమె ఆప్, కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా వెనుకబడి ఉన్నారు.
ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి భూపేంద్ర పటేల్ ఘట్లోడియాలో దాదాపు 34 వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థి అమిత్ ఠక్కర్ వేజల్‌పూర్‌లో సుమారు 45 వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. వావ్ నియోజకవర్గం సిటింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గనిబెన్ ఠాకూర్ దాదాపు 3,000 ఓట్లతో వెనుకబడి ఉన్నారు.
కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ, గుజరాత్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని భావించరాదని చెప్పారు. చాలా ప్రాంతాల్లో తమ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని, కొన్ని చోట్ల రాలేదని చెప్పారు. మంచి ఫలితాలు వచ్చిన చోట మరింత మెరుగుపడాలంటే ఏం చేయాలి? అనుకున్న ఫలితాలు రానిచోట్ల చేయవలసినది ఏమిటి? అనే అంశాలను పరిశీలించవలసి ఉందని చెప్పారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గుజరాతీల ఓట్లతో తమ పార్టీ జాతీయ పార్టీగా మారబోతోందన్నారు. విద్య, ఆరోగ్యం రాజకీయాలు జాతీయ రాజకీయ వేదికపైకి తొలిసారి రాబోతున్నాయన్నారు. యావత్తు దేశానికి అభినందనలు తెలిపారు.
గుజరాత్‌లో బీజేపీ దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.