modi-pawan meet: మోదీ-పవన్‌ భేటీ.. ఐదు పేజీల బ్రీఫ్‌ నోట్‌తో సిద్ధమైన పవన్‌

ABN , First Publish Date - 2022-11-11T18:42:39+05:30 IST

ప్రధాని మోదీ (modi), జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీ ఆసక్తి నెలకొంది. ఈ భేటీ కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

modi-pawan meet: మోదీ-పవన్‌ భేటీ.. ఐదు పేజీల బ్రీఫ్‌ నోట్‌తో సిద్ధమైన పవన్‌

విశాఖ: ప్రధాని మోదీ (modi), జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీ ఆసక్తి నెలకొంది. ఈ భేటీ కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఐదు పేజీల బ్రీఫ్‌ నోట్‌తో పవన్‌ సిద్ధమయ్యారు. వైసీపీ (YCP) ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు... వివిధ వర్గాలు పడుతున్న ఇబ్బందులపై ఈ భేటీలో పవన్ పస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, విశాఖ, ఇప్పటం (Visakha Ippatam) ఘటనలను మోదీ దృష్టికి పవన్ తెస్తారని జనసేన నేతలు చెబుతున్నారు. కొంతమంది బీజేపీ (BJP) నేతల వ్యవహారశైలిపై పవన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తన వైఖరిని మోదీకి స్పష్టంగా చెప్పాలని పవన్‌ భావిస్తున్నారు. అమరావతి అంశంలో నలుగురు బీజేపీ నేతల వ్యవహారశైలిపై ఇప్పటికే కేంద్రమంద్రి అమిత్‌ షా (Amit Shah) సహా బీజేపీ ముఖ్యనేతలకు పవన్‌ ఫిర్యాదు చేశారు. తిరుపతిలో బీజేపీ నేతలకు అప్పట్లో అమిత్‌ షా క్లాస్ తీసుకున్నారు. చాలా సంవత్సరాల తరువాత భేటీకి రావాల్సిందిగా పీఎంఓ నుంచి పవన్‌కు ఫోన్ వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని రెండోసారి పవన్‌ పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే.

శుక్రవారం సాయంత్రం నుంచి విశాఖపట్నంలో అందుబాటులో ఉండాలని జనసేనానికి బీజేపీ నుంచి సమాచారం అందింది. నేవీ అతిథిగృహం ఐఎన్‌ఎస్‌ చోళాలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పవన్‌ను విందు భేటీలో కలుస్తారని తెలిసింది. ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే శనివారం ఉదయం అల్పాహారం సమయంలో కలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వైసీపీ అరాచక పాలనను జనసేనాని ఈ సందర్భంగా ప్రధానికి వివరిస్తారని సమాచారం. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలతో వచ్చిన గ్యాప్‌.. పవన్‌ను సరిగా ఉపయోగించుకోవడం లేదంటూ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రధానిని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో పవన్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకోనున్నారు. ఆదివారం వరకూ నగరంలోనే ఉంటారు. ఈ భేటీపై జనసేన స్పందించకపోవడం గమనార్హం.

Updated Date - 2022-11-11T18:42:40+05:30 IST