Lokesh: ఇన్నేళ్లకు బీసీలు గుర్తొచ్చారా జగన్ గారూ?
ABN , First Publish Date - 2022-12-07T10:57:55+05:30 IST
అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత బీసీలు గుర్తొచ్చారా జగన్ రెడ్డి గారూ? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు.
అమరావతి: అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత బీసీలు గుర్తొచ్చారా జగన్ రెడ్డి గారూ? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Lokesh) వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... స్వాతంత్య్రం వచ్చాక బీసీలకు ఏ ముఖ్యమంత్రీ చేయనంత అన్యాయం చేశారన్నారు. వెనకబడిన తరగతుల వెన్నుముక విరిచేసిన మీకు బీసీల పేరెత్తే అర్హత లేదని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు టీడీపీ కల్పించిన 34 శాతం రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించినందుకు జగన్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2.70 కోట్ల మంది వెనకబడిన తరగతుల జనాభా సబ్‌ప్లాన్ నిధులు మళ్లించి బీసీలకు చేసింది ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ముఖ్య పదవులు మీ సామాజిక వర్గానికి ఇచ్చుకొని బీసీలకు చేసిన సామాజిక అన్యాయంపై బీసీ సభావేదిక నుంచి సమాధానం చెప్పాలన్నారు. బీసీ నేతలను, కార్యకర్తలను అంతమొందించిన నరహంతక జగన్ రెడ్డి సర్కారు జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.