Chandrababu letter to CS: మాండూస్ తుఫాను బాధిత రైతులను ఆదుకోండి...
ABN , First Publish Date - 2022-12-15T14:58:19+05:30 IST
మాండూస్ తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలని, ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
అమరావతి: మాండూస్ తుఫాను (Mandour Cyclone) బాధిత రైతులను ఆదుకోవాలని, ధాన్యం రైతుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Nara Chandrababu Naidu) డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary to the State Government)కి చంద్రబాబు లేఖ రాశారు.
లేఖలో అంశాలు:
• మాండూస్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
• తుఫాను కారణంగా అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
• వరి, అపరాలు, అరటి, బొప్పాయి, పొగాకు, పప్పు శనగ, మిరప, ప్రత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
• తుఫాను కారణంగా కోత కొచ్చిన వరి పంట నీటమునగడంతో పాటు ఆరబెట్టిన ధాన్యం తడిసింది.
• తుఫానుతో రైతులకు వేల కోట్ల నష్టం జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది.
• ధాన్యం సేకరణ లక్ష్యంలో ప్రభుత్వం భారీగా కోత విధించింది.
• ప్రభుత్వ ఆంక్షలు, కొత్త నిబంధనల కారణంగా పంటను సరైన ధరకు అమ్ముకునే పరిస్థితి లేక ధాన్యం రైతులు నానా యాతన పడుతున్నారు.
• ధాన్యంలో తేమ 17 శాతం కంటే అధికంగా ఉంటే మద్దతు ధరలో కోత కోస్తున్నారు.
• తేమ శాతం తగ్గించుకునేందుకు 20 రోజులుపైగా ధాన్యాన్ని రోడ్లపై, కళ్లాల్లో ఉంచాల్సి వస్తోంది.
• ధాన్యం ఆరబెట్టడానకి బరకాలు, టార్పాలిన్లు, కూలీల ఖర్చు రైతుకు అదనపు భారంగా మారుతుంది.
• ధాన్యం కొనుగోలుకు పరిమితులు విధించి.. దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వమే సూచించడం సరికాదు.
• వరి రైతులను గోనె సంచుల కొరత వేధిస్తోంది.
• రాయితీపై రైతులకు అందించే టార్పాలిన్‌ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నర సంవత్సరాల నుంచి నిలిపివేసింది.
• ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.25 లక్షల ఎకరాల్లో పొగాకు రైతులు నష్టపోయారు.
• తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు వెంటనే అన్ని జిల్లాల్లో ప్రారంభించాలి.
• తుఫానుకు నష్టపోయిన వరి, అపరాలకు ఎకరానికి రూ.20 వేలు, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి.
• ఈ-క్రాప్ ఇతర నిబంధలు, ఆంక్షలు లేకుండా ఇన్యూరెన్స్ పరిహారం త్వరగా అందించాలి.
• కౌలు రైతులకు నేరుగా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
• ధాన్యం రైతులు పంట నూర్చిన వెంటనే అక్కడే కొనుగోలు చేసే విధానం తీసుకురావాలి.
• ధాన్యంలో తేమ శాతంతో సంబంధం లేకుండా పంట అంతా కొనుగోలు చేయాలి.