Share News

Kapil Sibal: మోదీజీ..ఇలాంటి వ్యాఖ్యలతో 'వికసిత్ భారత్' ఎలా సాధ్యం?.. నిలదీసిన కపిల్ సిబల్

ABN , Publish Date - May 08 , 2024 | 07:44 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న పలు వ్యాఖ్యలతో రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ విభేదించారు. మోదీ చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టంగా ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ తన అధికారాలను వినియోగించుకోవడంలో అచేతనంగా ఉండిపోతోందని అన్నారు.

Kapil Sibal: మోదీజీ..ఇలాంటి వ్యాఖ్యలతో 'వికసిత్ భారత్' ఎలా సాధ్యం?.. నిలదీసిన కపిల్ సిబల్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేస్తున్న పలు వ్యాఖ్యలతో రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) విభేదించారు. మోదీ చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టంగా ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ (EC) తన అధికారాలను వినియోగించుకోవడంలో అచేతనంగా ఉండిపోతోందని అన్నారు. మోదీ చేస్తున్న వ్యాఖ్యలతో 'వికసిత్ భారత్' భారత్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.


అయోధ్య రామాలయానికి 'బాబ్రీ తాళం' ఎలా?

మధ్యప్రదేశ్‌లోని ధర్ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మాట్లాడుతూ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 400 సీట్లు ఇస్తే అయోధ్యలో రామాలయానికి 'బాబ్రీ తాళం' వేయకుండా కాంగ్రెస్‌ను నిలువరిస్తామని అన్నారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను కపిల్ సిబల్ తప్పుపట్టారు. అయోధ్య రామాలయానికి బాబ్రీ తాళం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. ''పీఎం జోస్యం చెబుతున్నట్టున్నారు. ఆయననే దీనిపై అడగాలి. ఇలాంటి స్టేట్‌మెంట్లకు 'తాళం' వేసే అధికారం ఈసీకి ఉంది. కానీ ఈసీ ఆ పని చేయడం లేదు. మోదీ స్టేట్‌మెంట్ కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది. అలాంటి వ్యాఖ్యలు చేసే స్టార్ క్యాంపెయినర్లకు ముకుతాడు వేసే అధికారం ఈసీకి ఉన్నా తగినంత ధైర్యం చేయడం లేదు. స్వంతంత్ర సంస్థలుగా పేరున్న సంస్థలు కూడా పరివార్‌‌లో భాగమవుతున్నాయి'' అని సిబల్ వ్యాఖ్యానించారు.


ఓట్ జీహాద్ Vs రామ రాజ్యం

'జోట్ జీహాద్‌' వెంట ఉంటారో 'రామ రాజ్యం' వైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలంటూ మోదీ పదేపదే చేస్తున్న వ్యాఖ్యాలను సైతం సిబల్ తప్పుపట్టారు. ఇలాంటి ప్రకటనలతో వికసిత్ భారత్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ''ఇదెలాంటి ప్రకటనగా భావించాలి? ఇందువల్ల వికసిత్ భారత్ సాకారమవుతుందా? అన్ని మతాలు, వర్గాలను ఏక తాటిపై తీసుకురావడం సాధ్యమవుతుందా? తాను ఏదైతో చెబుతున్నారో దానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇది దురదృష్టకరం. ప్రపంచంలోనే అది పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మీరు ప్రధాని. అలాంటి స్టేట్‌మెంట్లతో వికసిత్ భారత్‌‌ను ఎలా సుసాధ్యం చేస్తారు? బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని మిమ్మల్ని కోరుతున్నాను'' అని ప్రధానిని ఉద్దేశించి సిబల్ అన్నారు.

PM Modi: శరీరం రంగు చూపి ప్రజలను అవమానిస్తారా?.. శామ్ పిట్రోడాపై మోదీ నిప్పులు


సంపద పంపిణీ, మంగళసూత్రాలు ఊడలాక్కోవడంపై...

కాంగ్రెస్ పార్టీ సంపద పంపిణీకి, మహిళల మంగళ సూత్రాలను ఊడలాక్కునేందుకు యోచన చేస్తోందంటూ మోదీ చేస్తున్న వ్యాఖ్యలతో సైతం సిబల్ విభేదించారు. మోదీ చేస్తు్న్న వ్యాఖ్యలపై ఆయనకు ఈసీ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ''ఈసీ నుంచి ఎలాంటి చర్యలు ఉండటం లేదు. పైగా ప్రభుత్వానికి, ఆ పార్టీకి (బీజేపీ) ఈసీ కట్టుబడి ఉంటోంది. ప్రధానికి కానీ, కనీసం బీజేపీకి కానీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఇక ఈసీ నుంచి ఎవరైనా ఆశించేది ఏముంటుంది? ఈసీ తమ పవిత్రమైన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవడం శోచనీయం'' అని సిబల్ అన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 07:44 PM