తత్కాల్ టికెట్లు.. ఇంత ఈజీగా పొందవచ్చా.. 

తక్కువ ఖర్చుతో సుఖవంతమైన ప్రయాణం కావాలంటే రైలునే అందరు ఎంచుకుంటారు. అత్యవసర ప్రయాణం, వరుస సెలవులు వచ్చినప్పుడు కుటుంబంతో కలిసి ఊరెళ్లేందుకు దాదాపుగా అంతా రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతారు.

ఈ సమయంలో రైలు టికెట్లన్నీ ఫుల్ అయిపోయి.. వెయింటింగ్ లిస్టు దర్శనమిస్తుంది. దీంతో ప్రయాణానికి ఒకరోజు ముందు తాత్కాల్ టికెట్ల కోసం చాలా మంది క్యూ కడతారు.

తత్కాల్ టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. వీటి తెల్లవారుజాము నుంచే రైల్వే రిజర్వేషన్ కేంద్రాల వద్దకు వచ్చి ప్రజలు క్యూలో నిలబడతారు. ఇంట్లో సిస్టమ్ ఉంటే వాటి ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.  

ఈ తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. వీటిని అనుసరిస్తే.. సులువుగా టికెట్లు చేజిక్కించుకోవచ్చు.

ఏసీ బెర్తుల కోసం తత్కాల్ ఉదయం 10, నాన్ ఏసీకైతే ఉదయం 11 గంటలకు బుకింగ్స్ ప్రారంభమవుతాయి. చివరి నిమిషం వరకు కాకుండా తత్కాల్ విండో ఓపెన్ కావడానికి రెండు మూడు నిమిషాల ముందే రైల్ వన్ యాప్ లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లాగిన్ కావాలి. చివరి నిమిషంలో లాగిన్ అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంది. 

ప్రయాణికుల వివరాలు ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్ వన్ యాప్‌లోని మాస్టర్ లిస్ట్‌లో సేవ్ చేసుకోవాలి. తద్వారా బుకింగ్ సమయంలో పేరు, వయస్సు టైప్ చేసే అవసరం ఉండదు.  దీంతో రిజర్వేషన్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది.

అలాగు మీ పేమెంట్ ఆప్షన్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ఐఆర్‌సీటీసీ వ్యాలెట్‌ను ఉపయోగించడం వల్ల పేమెంట్ ప్రాసెస్ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ పేమెంట్ త్వరగా అయ్యేలా జాగ్రత్త పడాలి. 

సెకన్ల వ్యవధిలోనే ఈ తత్కాల్ టికెట్లు అయిపోతుంటాయి. ఇంటర్నెట్ స్పీడ్‌తోపాటు.. మీ వేగం కూడా ముఖ్యమేననే విషయాన్ని గమనించాలి. 

ఒక కాగితంపై రైలు నెంబర్లు, రైల్వేస్టేషన్ కోడ్‌లు ముందే రాసుకుని పక్కన పెట్టుకోవాలి. 

ఇంటర్నెట్ స్పీడ్‌ ఎంత వేగంతో ఉంటుందో.. ఈ టికెట్లు బుక్ చేసే సమయంలో మనం కూడా అంతే వేగంగా ఉంటేనే ఈ తత్కాల్ టికెట్లు పొందవచ్చు.