ఆదాయపు పన్ను శాఖ కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయడంతో.. ప్రతి ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డు తప్పని సరిగా మారింది.
రూ.50 వేలకు పైబడిన నగదు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, బ్యాంకింగ్, పెట్టుబడులకు పాన్ కార్డు ఉండాల్సిందే.
వాహనాల కొనుగోలు, విక్రయ లావాదేవీలతోపాటు బ్యాంకు, పోస్టల్ ఖాతా తెరవాలంటే.. పాన్ కార్డు తప్పని సరిగా ఉండాల్సిందే.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి డీమ్యాట్ ఖాతా తెరవాలంటే.. పాన్ లేకుండా సాధ్యం కాదు.
హోటల్, రెస్టారెంట్‌లలో భారీ నగదు చెల్లింపులు.. విదేశీ ప్రయాణం కోసం అంతకంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీ కొనుగోలు కోసం పాన్ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు, బాండ్లలో రూ. 50 వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు పాన్ వివరాలు తప్పని సరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
బ్యాంకింగ్ లావాదేవీల్లో.. ఒకే రోజులో రూ.50 వేలు కంటే ఎక్కువ నగదు జమ చేయడం లేదా విత్ డ్రా (నగదు తీయడం)కి పాన్ కార్డు అవసరమవుతుంది.
ఏడాదికి రూ.50 వేల కంటే ఎక్కువ జీవిత బీమా ప్రీమియం చెల్లించడం వంటి సందర్భాల్లో పాన్ వివరాలు తప్పని సరి.
డిజిటల్ వాలెట్లలో ఏడాదికి రూ. 50 వేల కంటే అధికంగా ఖర్చు చేసినా పాన్ అవసరం ఉంటుంది.
భూమి లేదా ఇల్లు కొనుగోలు వంటి భారీ లావావేదీల్లో కూడా పాన్ పాత్ర అత్యంత కీలకం.
రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు లేదా విక్రయం.. రూ. లక్ష కంటే ఎక్కువ విలువైన అన్‌లిస్టెడ్ షేర్ల కొనుగోలు వంటి సందర్భాల్లో పాన్ కార్డు లేకుండా ప్రక్రియ పూర్తి కాదు.
పాన్ కార్డు.. ప్రతి ఆర్థిక లావాదేవీని ట్రాక్ చేసే ప్రధాన సాధనం అని ఆర్థిక రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
పాన్ కార్డు లేకుండా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేయడం వల్ల ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకునే ప్రమాదం ఉంది.
ప్రతి పౌరుడు తన పాన్ కార్డు యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే ఆధార్‌తో పాన్ కార్డు లింక్ అయిందో లేదో నిర్ధారించుకోవాలి.