Mekapati Gowtham గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

ABN , First Publish Date - 2022-02-22T12:47:28+05:30 IST

నిండైన విగ్రహం... మృదుస్వభావం... ఉన్నత వ్యక్తిత్వం... తరతమ భేదాలు లేకుండా

Mekapati Gowtham గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

నెల్లూరు : నిండైన విగ్రహం... మృదుస్వభావం... ఉన్నత వ్యక్తిత్వం... తరతమ భేదాలు లేకుండా అందరినీ ఆప్యాయంగా పలుకరించే స్నేహ గుణం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మానవత్వం... హుందా రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం... అవినీతి, అక్రమాలకు ఆమడదూరం...! వీటన్నింటిని కలబోసుకున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చిన్నవయసులోనే అందనంత దూరం వెళ్లిపోయాడన్న నిజాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉక్కులాంటి మనిషికి గుండెపోటు రావడం ఏమిటి..? అని  నిశ్చేష్టులయ్యారు. గౌతమ్‌రెడ్డి మరణించారన్న చేదు నిజాన్ని తెలుసుకొని కన్నీళ్లపర్యంతమయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న నాయకుడు ఉన్నపళంగా తమను వీడి వెళ్లిపోవడం పట్ల ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు భోరున విలపిస్తున్నారు.. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


వారసుడిగా ఆరంగ్రేటం..

విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి సొంత వ్యాపారాల నిర్వహణలో నిమగ్నమైన గౌతమ్‌రెడ్డి 2014లో మేకపాటి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉన్న స్నేహ సంబంధాల నేపధ్యంలో వైసీపీ స్థాపించిన వెంటనే ఆయన వెంట నడిచారు. తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి రావడానికి గల ప్రధాన కారణాల్లో గౌతమ్‌రెడ్డికి, జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య ఉన్న స్నేహం ఒకటి. జగన్‌ కోరిక మేరకే గౌతమ్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది.  


తొలి ఎన్నికల్లోనే విజయం..

ఆ క్రమంలోనే 2014 లో వైసీపీ అభ్యర్థిగా ఆత్మ కూరు నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. ప్రజల్లో ఉన్న మంచి పేరుతో 2019 ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది జగన్‌ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అయ్యా రు. జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో తను ఒకడైనా, మంత్రి పదవి చేతికి చిక్కినా ఆయన ఏ రోజు అధికార దర్పం ప్రదర్శించకపోవడం ప్రజల్లో, రాజకీయ పార్టీ నాయకుల్లో ఆయన పట్ల గౌరవాన్ని పెంచింది. అందరితో మర్యాదపూ ర్వకంగా వ్యవహరించే తీరు, రాజకీయ విమర్శల్లో సైతం మర్యాద తప్పని మాట తీరు గౌతమ్‌ రెడ్డిని అందరికీ దగ్గర చేశాయి.


ఆత్మకూరు అభివృద్ధికి కృషి..

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీశాఖల మంత్రిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి  ప్రమాణ స్వీకారం అనంతరం ‘ఆంధ్రజ్యోతి‘ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...‘‘  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. తనను ఆదరించి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా. మెట్టప్రాంతాల అభివృద్ధికి బాటలు వేసి సాగు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తా. పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిసారిస్తా. ఆత్మకూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా’’నని అన్నారు. యువకుడు, విద్యావంతుడైన గౌతమ్‌రెడ్డికి రాష్ట్రమంత్రి వర్గంలో చోటు దక్కడంతో  మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశపడ్డారు. 


ఆత్మకూరు నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధుల మంజూరుకు కృషి చేశాడు. సోమశిల నీటి సామర్ధ్యం పెంపునకు, ఉత్తర కాలువ అభివృద్ధికి, సోమశిల హైలెవల్‌ కాలువ అభివృద్ధికి నిధుల మంజూరుకు తన వంతు పాత్ర పోషించాడు. ఎంజీఆర్‌ హెల్పలైన్‌ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి సోమవారం సచివాలయాల్లో స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ  ప్రజల మన్ననలు పొందాడు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గౌతమ్‌రెడ్డి ఐదేళ్లలో ఆయన చేపట్టిన పనుల్లో ముఖ్యంగా తాగు, సాగునీటి సమస్యలపైనే కొంతమేరకు స్పందించారు. రూ.5కోట్ల ఎంపీ నిధులతో నియోజకవర్గం లోని 25 గ్రామాల్లో వాటర్‌ ప్లాంట్లను నిర్మించారు. తన సొంతని ధులతో అనంతసాగరం మండలం కొత్తపల్లి ఏటికాలువ, కమ్మవారిపల్లి వద్ద ఉపకాలువకు పూడికతీత పనులు చేపట్టారు. జడ్పీ నిధులతో సైతం కొన్ని గ్రామాల్లో కొంతమేర అభివృద్ధి పనులు చేపట్టారు.


పారిశ్రామిక ప్రగతికి బాటలు..

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జిల్లా పారిశ్రామిక రంగం దిగ్ర్భాంతికి గురైంది.  జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అనేక నూతన ప్రాజెక్ట్‌లు, ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు, మెగా ఇండ్రస్ట్రియల్‌ హబ్‌లను ఆయన తీసుకువచ్చారు.  టాటా కెమికల్స్‌, ఇండోస్‌కాఫీ, సెంతినీ ప్లాస్టిపైప్స్‌ ప్రాజెక్ట్‌, తారకేశ్వర టెక్స్‌స్టేల్‌ హబ్‌, నాట్కో ఫార్మా కంపెనీ ప్రాజెక్టులను రూ.1800కోట్ల పెట్టుబడులతో వచ్చేలా కృషి చేశారు. వీటితోపాటు దాదాపు 649 ఎంస్‌ఎంఈ పరిశ్రమల ఏర్పాటు,  జిందాల్‌, గ్రీన్‌టెక్‌, ఇండచ్‌ కంపెనీ, గ్రీన్‌లామ్‌, బంగీ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ  ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సొంత నియెజకవర్గం ఆత్మకూరు నారంపేట ప్రాంతంలో దాదాపు 173 ఎకరాలతో ఫర్నిచర్‌, ప్లాస్టిక్‌ తయారీ పార్క్‌ను మంజూరు చేశారు. 


మంత్రి మేకపాటి 2020లో నూతన పారిశ్రామిక పాలసీని తీసుకువచ్చారు. ఇందులో ఎస్‌ఎస్‌టీల కోసం రాయితీని 35శాతం నుంచి 45శాతానికి పెంచారు. జిల్లాలోని ఎస్‌ఎంఎంఈ పారిశ్రామిక వేత్తలకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో రాయితీ నిధులను మంజూరు చేయించారు.  స్థానిక యువతకు పరిశ్రమల్లో 75శాతం రిజర్వేషన్‌తో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. జిల్లాలో నిరుద్యోగుల కోసం  పలుచోట్ల జాబ్‌మేళాలను ఏర్పాటు చేశారు.




ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2022-02-22T12:47:28+05:30 IST