Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 22 Feb 2022 02:49:51 IST

మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

twitter-iconwatsapp-iconfb-icon
 మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

గుండెపోటుతో కన్నుమూసిన యువ మంత్రి

కాఫీ అడిగి... సోఫాలోనే కుప్పకూలిన గౌతమ్‌

హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా దక్కని ఫలితం

వారంపాటు దుబాయ్‌లో అధికారిక పర్యటన

గతనెలలో స్వల్ప లక్షణాలతో కొవిడ్‌ బారిన..

ఇంట్లోనే ఉండి చికిత్స పొందిన మంత్రి

కొవిడ్‌ అనంతర సమస్యలతోనే గుండెపోటు!

నివాళులు అర్పించిన జగన్‌, చంద్రబాబు, పవన్‌

ఏపీ, తెలంగాణ నేతలు, ప్రముఖుల సంతాపం

రాష్ట్రంలో 2 రోజులు సంతాప దినాలు

రేపు ఉదయగిరిలో గౌతమ్‌ రెడ్డి

అంత్యక్రియలు

మేకపాటి కుటుంబంలో విషాదం


హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): సౌమ్యుడు, వివాదరహితుడు, యువ నాయకుడు, సమర్థుడిగా పేరు తెచ్చుకున్న రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. కొవిడ్‌తో కోలుకున్న ఆయన ఇటీవలే దుబాయ్‌ ఎక్స్‌పో-2022లో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లారు. వారంరోజులపాటు అక్కడ జరిగిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపారు. తిరిగివచ్చాక ఆదివారం రాత్రి వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడిపారు. అంతలోనే ఇంత విషాదం జరగడంతో రెండు రాష్ట్రాల  ప్రజలు, రాజకీయ ప్రముఖులు దిగ్ర్భాంతికి గురయ్యారు.


కుటుంబ సభ్యులు, ఇతర వర్గాలు అందించిన సమాచారం ప్రకారం... మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధికారిక పర్యటన ముగించుకుని... శనివారం రాత్రి దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆదివారం రాత్రి  హైదరాబాద్‌లో జరిగిన బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. బంధువులు, సన్నిహితులతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం రాత్రి 9.45 గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 47లోని తన నివాసానికి వచ్చారు. సోమవారం ఉదయం 6 గంటలకు నిద్రలేచారు. కొద్దిసేపు ఫోన్‌ చూస్తూ గడిపారు. 6.25 గంటలకు తన స్నేహితుడు శ్రీకాంత్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. ‘‘మంగళవారం సీఎం అపాయింట్‌మెంట్‌ ఉంది. మనం సాయంత్రం అమరావతి వెళ్లాలి. సిద్ధంగా ఉండు’’ అని చెప్పారు. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంట్లో రెండో అంతస్తుకు వెళ్లారు. జిమ్‌కు వెళ్లేందుకు వీలుగా డ్రైవర్‌ నాగేశ్వరరావును పిలవాలని,  కాఫీ తీసుకురావాలని వంట మనిషికి చెప్పారు.  ఉదయం 7.16 గంటలకు గౌతమ్‌ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రనొప్పితో సోఫా నుంచి కిందకు ఒరిగిపోయారు.


ఆయన సతీమణి శ్రీకీర్తి గట్టిగా అరిచి... సిబ్బందిని అప్రమత్తం చేశారు. డ్రైవర్‌ నాగేశ్వరరావు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. నొప్పితో ఇబ్బంది పడుతున్న గౌతమ్‌ రెడ్డి ఛాతీ మీద చేతితో నొక్కి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. ఛాతీలో నొప్పిగా ఉందని, మంచి నీళ్లు కావాలని గౌతమ్‌ రెడ్డి అడిగారు. నీళ్లు ఇచ్చినా తాగలేకపోయారు. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య నిపుణులు ఆయనను పరీక్షించారు. ఆస్పత్రికి వచ్చే సరికే గౌతమ్‌ రెడ్డికి కార్డియాక్‌ అరెస్టు జరిగినట్లు నిర్ధారించారు. అయినప్పటికీ... సీపీఆర్‌తోపాటు అధునాతన కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌తో గౌతమ్‌ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటన్నరపాటు తమ ప్రయత్నాలు కొనసాగించారు. అయినప్పటికీ... ఫలితం లేకపోవడంతో, ‘మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి కన్నుమూశారు’ అని ఉదయం 9.16 గంటలకు అధికారికంగా ప్రకటించారు. గౌతమ్‌ రెడ్డికి గత నెల 22న కొవిడ్‌ వచ్చింది. స్వల్ప లక్షణాలే ఉండటంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. కొవిడ్‌ అనంతర  సమస్యల వల్లే గుండెపోటు వచ్చి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. జిమ్‌ వ్యాయామం చేస్తుండగా గుండెపోటు వచ్చిందన్న వార్తలను కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. 


కన్నీరు మున్నీరు...

‘మంత్రి గౌతమ్‌ రెడ్డి ఇకలేరు’ అనే వార్త ప్రసార మాధ్యమాల ద్వారా నిమిషాల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించింది. ‘ఔనా... నిజమా!’ అని అందరూ విస్తుపోయారు. అప్పటిదాకా తమ ముందే నవ్వుతూ తిరిగిన వ్యక్తి ఇక లేరనే విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారి విషాదానికి అంతే లేకుండా పోయింది. కుమారుడి మరణ వార్త తెలియగానే గౌతమ్‌ రెడ్డి తండ్రి, సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుప్పకూలిపోయారు. తల్లి మణిమంజరి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. గౌతమ్‌ రెడ్డి దంపతులకు కుమార్తె సాయి అనన్యా రెడ్డి, కుమారుడు కృష్ణార్జున రెడ్డి ఉన్నారు. కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. తండ్రి మరణ వార్త తెలియగానే ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.


తరలివచ్చిన నేతలు, అభిమానులు

గౌతమ్‌రెడ్డి మరణ వార్తను తెలుసుకున్న హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఆయన అభిమానులు పెద్దఎత్తున అపోలో ఆస్పత్రికి తరలివచ్చారు. వైఎస్‌ షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్‌, తల్లి విజయలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని బంధువులను ఓదార్చారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీపీఐ నేత నారాయణ, కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్ర రావు తదితరులు ఆసుపత్రికి వచ్చారు. ఆతర్వాత మేకపాటి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ... గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ఏపీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్‌, బొత ్స సత్యనారాయణ, పేర్ని నాని అక్కడికి వచ్చారు. టీడీపీ నేతలు గల్లా జయదేవ్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, తెలంగాణ మంత్రులు, ఎంపీలు నివాళులు అర్పించారు.


అధికారిక లాంఛనాలతో...

మేకపాటి గౌతమ్‌ రెడ్డి భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ఎయిర్‌ అంబులెన్స్‌లో నెల్లూరు జిల్లా ఉదయగిరికి తరలిస్తారు. ఉదయగిరిలో మేకపాటి కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గౌతమ్‌ రెడ్డి మృతికి సంతాప సూచకంగా సచివాలయంలో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. అంత్యక్రియలకు సీఎం జగన్‌ హాజరవుతారని తెలిపారు.


ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం  

రోజూ జిమ్‌లో గౌతమ్‌రెడ్డి గంటసేపు కసరత్తులు 

 ఆజానుబాహుడిగా మేకపాటి ఆకర్షణ 

 గుండెపోటు వార్తపై సర్వత్రా విస్మయం 

(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)

మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి జిమ్‌ అంటే ఆరో ప్రాణం అని చెబుతారు. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా సరే ఉదయం, సాయంత్రం గంట నుంచి రెండు గంటల సేపు ఆయన జిమ్‌లో గడిపేవారు. అందుకు అనుగుణంగా నెల్లూరు, హైదరాబాద్‌లలోని తన నివాసాల్లోనే జిమ్‌ కోసం ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకున్నారు. జిమ్‌ ఎలా చేయాలి? ఎంత సేపు చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?.. ఈ విషయాలు చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ట్రైనర్‌ను నియమించుకున్నారు. గౌతమ్‌ రెడ్డి ఎక్కడ కనిపించినా చాలా కళ్లు ఆయన్ను ప్రత్యేకంగా గమనిస్తాయి. దానికి కారణం ఆయన శరీరాకృతి. ఆరడుగుల పొడవు, కండలు తిరిగిన దేహదారుఢ్యంతో ఠీవిగా కనిపించేవారు. గౌతమ్‌రెడ్డి ఆహార ప్రియుడు అనే ప్రచారం ఉంది. ఎంత తింటారో అంత ఖర్చు చేసేవరకు జిమ్‌ రూమ్‌ వదలి బయటకు రారని, అందుకే ఆయన అంత ఫిట్‌గా ఉండేవారని అనుచరులు చెబుతారు. సోమవారం ఉదయం గౌతమ్‌రెడ్డికి గుండెపోటు వచ్చిందనే వార్తను ప్రజలు నమ్మలేకపోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు మొదట ఏ గౌతమ్‌రెడ్డికి..? అంటూ ఆరా తీశారు. ఆయనకు గుండెపోటు రావడం ఏమిటీ..!? అంటూ నమ్మలేదు. కొంత సేపటికి అన్ని టీవీల్లో గుండెపోటుతో మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి అనే వార్తలు ప్రసారం కావడంతో నిర్ఘాంతపోయారు.'


స్వగ్రామంలో విషాదఛాయలు

మర్రిపాడు, ఫిబ్రవరి 21: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో  ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. టీవీల్లో ఆయన మరణవార్తలు, హైదరాబాద్‌లోని మంత్రి నివాసం వద్ద మృతదేహం దృశ్యాలను చూసి బంధువులు, గ్రామస్థులు కంటతడి పెట్టారు. చిన్నప్పటి నుంచి అందరితో సఖ్యతగా, కలుపుగోలుగా ఉండేవాడని మంత్రి మేనత్త సరోజనమ్మ కన్నీరుమున్నీరయ్యారు. 


అందరివాడు

రాజకీయాల్లో అజాతశత్రువు 

 ప్రతిపక్షాలు సైతం మెచ్చిన నాయకుడు

 ‘రైట్‌ పర్సన్‌ ఇన్‌ రాంగ్‌ పార్టీ’ అని ప్రశంస

(అమరావతి/నెల్లూరు-ఆంధ్రజ్యోతి) 

దశాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గౌతమ్‌ రెడ్డి స్వల్పకాలంలోనే పేరు సంపాదించుకున్నారు. వివాదాలకు దూరంగా హుందాతనంతో మెలుగుతూ తనకంటూ ప్రత్యేక స్థానం సాధించారు. అధికార దర్పం లేని నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఎప్పుడూ దుందుడుకు స్వభావం ప్రదర్శించలేదు. ప్రతిపక్షాలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడలేదు. ఉన్నత విద్యాభ్యాసం చేశాక కొన్నాళ్లు వ్యాపార రంగంలో ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశారు. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ చేశారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే భాషా ప్రావీణ్యం సొంతం. అయినా.. ఏనాడూ తానేదో పైనుంచి వచ్చానన్న భావన ఆయనలో ఉండేదికాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన నైజం. ప్రత్యర్థులు సైతం ఆయనను మనస్ఫూర్తిగా విమర్శించడానికి ఇష్టపడకపోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. 


జగన్‌తో స్నేహం 

మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి దంపతులకు ఆయన ప్రథమ సంతానం. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తర్వాత 1997లో కుటుంబసభ్యులు నడుపుతున్న కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో అడుగు పెట్టారు. కేఎంసీ పురోగతికి తన వంతు కృషి చేశారు. ఈ సందర్భంలోనే వైఎస్‌ జగన్‌తో గౌతమ్‌రెడ్డికి స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. 


వారసుడిగా రాజకీయాల్లోకి..

నెల్లూరు జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ కుటుంబాల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుటుంబం ఒకటి. రాజమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు నెల్లూరు ఎంపీగా పనిచేశారు. ఆయన వారసుడిగా గౌతమ్‌ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ వారసత్వంతో పాటు వైఎస్‌ జగన్‌తో ఉన్న స్నేహ సంబంధాలు ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ మార్పుల్లో మేకపాటి కుటుంబం జగన్‌ పక్షాన నిలిచింది. అప్పటికే కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీగా (నెల్లూరు) ఉన్న రాజమోహన్‌రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి జగన్‌ పార్టీలో చేరారు. ఈ చేరిక వెనుక జగన్‌తో గౌతమ్‌రెడ్డికి ఉన్న స్నేహమే ప్రధాన కారణమని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే 2014లో గౌతమ్‌రెడ్డి రాజకీయ అరంగ్రేటం చేశారు. తండ్రి రాజమోహన్‌రెడ్డి ప్రజలకు పరిచయమున్న నాయకుడు కావడంతో తొలి ఎన్నికలు ఆయనకు కలిసి వచ్చాయి. వైసీపీ అధికారంలో లేకపోయినా ఐదేళ్లపాటు ఆత్మకూరు అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండటంతో 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆత్మకూరు నుంచే పోటీ చేసి విజయం సాధించారు. 


అవినీతి మరకలకు దూరంగా.. 

2019 జూన్‌ 7న జగన్‌ కేబినెట్‌లో పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా పనిచేసిన మూడేళ్లూ ఆరోపణలకు, వివాదాలకు దూరంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల సమయంలో కానీ, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కానీ ఎప్పుడూ ఆయన దుడుకు స్వభావం ప్రదర్శించలేదు. ప్రతిపక్షాలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడలేదు. మంత్రి పదవిలో ఉన్నా ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించారు. మంత్రిగా అవినీతి మరకలకు దూరంగా ఉన్నారు.  


మెట్టప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆత్మకూరు మండలం నారంపేట సమీపంలో ఏడాది క్రితం పారిశ్రామికవాడకు శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ సమస్యను తీర్చడానికి మెగా జాబ్‌మేళాకు శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధుల మంజూరుకు కృషి చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన ఆత్మకూరు ప్రజానీకం రుణం తీర్చుకునేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని చెప్పేవారు. 


విలక్షణం.. విభిన్నం!

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, చేనేత జౌళి శాఖలు.. ఈ ఐదు శాఖలకూ మేకపాటి గౌతమ్‌రెడ్డి మంత్రి. జగన్‌ కేబినెట్‌లో ఇన్ని శాఖలను నిర్వహించింది ఈయనే. మంత్రిగా పనితీరు విభిన్నం. సమర్థ నిర్వహణ ఆయన లక్షణం. పేషీకి వచ్చేవారిలో సగం మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారుంటే.. సగం మంది ఆయన సొంత నియోజకవర్గం ఆత్మకూరువారే. ఎవరొచ్చినా ఆప్యాయంగా మాట్లాడేవారు. అందరితో మాట్లాడాకే పంపించేవారు. అంతేకాదు.. ఏ సమయంలో ఫోన్‌చేసినా స్పందించేవారు. ఒకవేళ ఎక్కడైనా సమావేశాల్లో ఉంటే మళ్లీ చేస్తానని చెప్పి.. చేసేవారు కూడా. ఆగర్భ శ్రీమంతుడైనా ఆ అహం గానీ, ఆ భావన గానీ కించిత్తు కూడా కనిపించేవి కాదు. ఎదుటివారిని ఆయన స్వాగతించే తీరు, వారితో ప్రవర్తించే తీరు, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితోను ఆత్మీయంగా వ్యవహరించిన తీరు.. ఆయన్ను విలక్షణమైన నాయకుడిగా నిలబెట్టాయి. ఇలా ఉండడం ఎలా సాధ్యమని చాలామంది ఆయన వ్యవహారశైలి చూసి ఆశ్చర్యపోతుండేవారు. శాఖాపరమైన అంశాలకు సంబంధించి ఆయన ప్రయత్నం అసామాన్యం. రెండేళ్లు కొవిడ్‌ ఉన్నా.. పరిశ్రమలు, పెట్టుబడులకు గడ్డుకాలమే అయినా.. తన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహించేవారు.


రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకు దిశానిర్దేశం చేసేవారు. పెట్టుబడులు తెచ్చేందుకు సీఎంవో సహకారం కూడా కీలకమని భావించేవారు. అది ఎంతవరకు వచ్చినా.. తన పని తాను చేసుకుపోయేవారు. ఒకరిపై అసంతృప్తి గానీ, అవిశ్వాసం గానీ కనబరిచేవారు కాదు. వీలైనన్ని పెట్టుబడులు తేవాలని మనస్ఫూర్తిగా తపించేవారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా అన్నా, తన సొంత నియోజకవర్గమన్నా ఆయనకు అమితమైన ప్రేమ. అక్కడ పెట్టుబడులు పెట్టాలని పలువురిని ప్రోత్సహించేవారు. - ఆంధ్రజ్యోతి, అమరావతి


సీఎంకే ఆ ఘనత 

ఇద్దామని..!

కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దుబాయ్‌ ఎక్స్‌పోకు భారీ బృందంతో మేకపాటి వెళ్లారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17 వరకు జరిగిన ఆ ఎక్స్‌పోలో అనేక మందితో పెట్టుబడుల కోసం సమావేశాలు జరిపారు. చిన్నా, పెద్దా కలిపి దాదాపు 400 భేటీల్లో పాల్గొన్నారు. ‘మనం ఎదగడానికి సాయపడిన వారికి తిరిగి సాయం చేయడం కంటే సంతృప్తి ఏముంటుంది.. రండి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి’ అని అక్కడి ప్రవాసులకు పిలుపిచ్చారు. ఈ పర్యటనలో తన సమక్షంలో రూ.5,150 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగేలా చేశారు. అయితే అక్కడ డీపీ వరల్డ్‌ అనే కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని మాత్రం ఆయన బయటకు వెల్లడించలేదు. దుబాయ్‌ నుంచి రాష్ట్రానికి వచ్చాక.. సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసి.. సదరు కంపెనీల ప్రతినిధులను ఆయనకు పరిచయం చేసి.. సీఎం చర్చలతోనే ఆ ఒప్పందం కుదిరిందని చెప్పాలనుకున్నారు. ఆ ఘనతను ముఖ్యమంత్రికే ఇవ్వాలని భావించారు. ఆదివారం ఉదయం దుబాయ్‌ నుంచి తిరిగొచ్చిన ఆయన.. మంగళవారం ఇందుకోసం సీఎం సమయం కూడా తీసుకున్నారు. ఆయన్ను కలిసి దుబాయ్‌ పర్యటన విశేషాలు వివరించి.. ఈ పెట్టుబడి ఒప్పందం గురించి ప్రకటిద్దామని భావించారు. విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలన్నీ చెబుతానని తనకు పరిచయమున్న పాత్రికేయులకు చెప్పారు కూడా. 


కొప్పర్తి మెగా హబ్‌లో 

కీలక పాత్ర..

గతంలో వచ్చిన పెట్టుబడి ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి, కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మంత్రి మేకపాటి గట్టి ప్రయత్నాలే చేశారు. కడప జిల్లా కొప్పర్తిలో ప్రారంభించిన జగనన్న వైఎస్సార్‌ మెగా పారిశ్రామిక హబ్‌కు ప్రణాళిక రూపకల్పన, దానిని ప్రారంభించడంలో ఆయనదే కీలకపాత్ర. అక్కడే ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ ఎలక్ర్టానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ విధానం  తయారీలోనూ ప్రధాన భూమిక పోషించారు. ఆ రెండు పారిశ్రామిక హబ్‌లకు పలు పరిశ్రమలు వచ్చేలా కృషిచేశారు. 


సాయం చేయడంలో మేటి 

గౌతమ్‌రెడ్డి మానవీయ విలువలు కలిగిన నేతగా ప్రజలు గౌరవిస్తారు. . మాట తీరులోనే కాకుండా ఆపద సమయంలో తనవంతు సాయం చేయడంలో ఆయన ముందుండేవారు. సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా సాయం చేసే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల సంగం వద్ద ప్రమాదవశాత్తు ఒక కుటుంబం వాగులో కొట్టుకుపోతే తల్లిదండ్రులను కోల్పోయి అనాఽఽథగా మిగిలిన నవదీప్‌ అనే చిన్నారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ పిల్లాడి విద్య, ఉపాధి బాఽధ్యతలు తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆపదంటూ తన వద్దకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా ఎంతోకొంత సాయం అందించేవారు. మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

సమర్థుడైన సహచరుడిని కోల్పోయా

గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి దంపతులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శారీరకంగా దృఽఢంగా, పూర్తి ఫిట్‌నె్‌సతో ఆరోగ్యంగా కనిపించే గౌతమ్‌రెడ్డి హఠాత్తుగా మరణించారన్న సమాచారాన్ని జగన్‌ ఒకంతట విశ్వసించలేకపోయారు. వాస్తవాన్ని తెలుసుకోవాలని సీఎంఓను ఆదేశించారు. మరణ వార్త నిర్ధారణ అయిన వెంటనే హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంఓను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సీఎం కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, రేవు ముత్యాలరాజు, ధనుంజయరెడ్డితో సీఎం సమావేశయ్యారు. గౌతమ్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సమర్థుడైన మంత్రివర్గ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక, వర్తక, ఐటీ అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని పారదర్శకంగా అమలు చేశారన్నారు. గొప్ప నాయకుడిని వైసీపీ కోల్పోయిందన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు, రాష్ట్రానికీ తీరని లోటన్నారు. సమావేశం అనంతరం  ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. భార్య భారతితో కలసి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం దంపతులు ఓదార్చారు. సీఎం జగన్‌ను పట్టుకొని గౌతమ్‌రెడ్డి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. సీఎంతో పాటు ఎంపీ విజయాసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిలతో పాటు పలువురు నేతలున్నారు. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు జూబ్లీహిల్స్‌లోని గౌతమ్‌రెడ్డి నివాసానికి చేరుకున్న సీఎం మధ్యాహ్నం 2.47 తిరిగి వెళ్లిపోయారు. సీఎం జగన్‌... కాన్వాయ్‌లో కాకుండా ప్రత్యేక వాహనంలో వచ్చారు. 

 మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కలిచివేసింది: చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి మరణం కలిచివేసిందన్నారు. ‘‘వివాదాలు లేని రాజకీయ వేత్త. చాలా తక్కువ కాలంలో సమర్థంగా పనులు నిర్వహించారు. మంత్రివర్గంలో మృదుస్వభావిగా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. గౌతమ్‌రెడ్డి తండ్రి రాజమోహన్‌రెడ్డిని, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. 

 మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

చూస్తుండగానేచూస్తుండగానే

ఉదయం 6 గంటలు: ఎప్పట్లాగానే నిద్ర లేచారు.

6.30: అరగంటపాటు ఫోన్‌లో మాట్లాడారు.

7.00: రెండో అంతస్థుకు వెళ్లారు.

7.12: డ్రైవర్‌ను పిలవాలని, కాఫీ తీసుకురమ్మని వంటమనిషికి చెప్పారు.

7.16: గుండెపోటు రావడంతో సోఫా నుంచి మెల్లిగా కిందకు ఒరిగారు. ఆయన సతీమణి కేకలు వేయడంతో... డ్రైవర్‌ నాగేశ్వరరావు అక్కడికి వచ్చి మంత్రి ఛాతీ మీద చేతితో నొక్కి ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించారు.

7.45: అపోలో ఆస్పత్రికి తరలింపు

9.16: గౌతమ్‌ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యుల ప్రకటన.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.