South Sudanలో దుష్ట సాంప్రదాయం.. ఆవుల కోసం కన్నకూతుళ్లను వేలం వేస్తున్న తల్లిదండ్రులు..

ABN , First Publish Date - 2022-06-23T00:46:00+05:30 IST

దక్షిణ సూడాన్.. మధ్య ఆఫ్రికాలో ఉన్న ఈ దేశం 2011 జూలై 9న సూడాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది.

South Sudanలో దుష్ట సాంప్రదాయం.. ఆవుల కోసం కన్నకూతుళ్లను వేలం వేస్తున్న తల్లిదండ్రులు..

దక్షిణ సూడాన్.. మధ్య ఆఫ్రికాలో ఉన్న ఈ దేశం 2011 జూలై 9న సూడాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అధిక భాగం వ్యవసాయం మీద ఆధారపడిన ఈ దేశంలో పేదరికం తాండవిస్తోంది. ఎంతలా అంటే కన్న కూతుళ్లను కూడా అమ్ముకుని జీవనం సాగించాలని తల్లిదండ్రులు భావించేంత. ఈ దేశం వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడడం వల్ల పశుసంపదకు విలువ చాలా ఎక్కువ. అమ్మాయిలను వేలం వేసి అందుకు బదులుగా ఆవులను తీసుకునే సాంప్రదాయం అక్కడ ఇప్పటికీ కొనసాగుతోంది. అక్కడి పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 


ఒక అమ్మాయి ధరను ఆమె తండ్రి, కాబోయే భర్త మధ్య జరిగే చర్చలు నిర్ణయిస్తాయి. ఒకమ్మాయి అందంగా ఉండి, ఉన్నత సామాజిక హోదా కలిగిన కుటుంబం నుంచి వచ్చినట్టైతే ఆమె 200 ఆవులను తీసుకురాగలదని నిర్ణయిస్తారు. కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తి తన కూతురిని వేలం వేసి ఏకంగా 520 ఆవులతో పాటు కార్లను కూడా దక్కించుకున్నాడట. `అమ్మాయి ఎంత తక్కువ వయసులో ఉంటే అందుకు ప్రతిఫలంగా ఎక్కువ పశువులు లభిస్తాయ`ని సెంటర్ ఆఫ్ ఇన్‌క్లూజివ్ గవర్నెన్స్, పీస్ అండ్ జస్టిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాక్‌లైన్ నసివా అన్నారు.


ఇది కూడా చదవండి..

పొలంలో కనిపించిన ప్రేమ జంట.. పట్టుకుని కొట్టి పెళ్లి చేసిన గ్రామస్తులు.. ఆమె తన కంటే రెండేళ్లు పెద్దయినా..


దేశంలో చాలా మంది ప్రజలు పేదరికంలో చిక్కుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో పాటు వరదలు వంటివి తోడవడంతో దక్షిణ సూడాన్‌లో ఆకలి కేకలు ఎక్కువవుతున్నాయి. UNICEF ప్రకారం, దక్షిణ సూడాన్‌లో దాదాపు మూడొంతుల మంది బాలికలు 15 ఏళ్లు నిండకముందే గర్భవతులు అవుతున్నారు. నిజానికి అక్కడి చట్టం ప్రకారం అమ్మాయిల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు. అయితే ఆ చట్టాన్ని అక్కడి ప్రజలు ఎవరూ పట్టించుకోరు. పేదరికంలో చిక్కుకున్న వారు తమ కుమార్తెలను అమ్మి వారు జీవించడానికి ఏదైనా పొందుతారు. యునిసెఫ్, ప్లాన్ ఇంటర్నేషనల్ ప్రకారం, South Sudanలో కేవలం 10% మంది బాలికలు మాత్రమే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.


బాలికలను పాఠశాలకు పంపడం వల్ల వారికి లైంగిక వేధింపులు వంటి ప్రమాదాలు ఎదురవుతాయని కొన్ని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయట. అలా లైంగిక వేధింపులకు గురైన బాలికలకు వివాహ సమయంలో పెద్దగా విలువ ఉండదని  తల్లిదండ్రుల భయమట. అక్కడి ప్రజల దృక్పథాన్ని మార్చేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 

Updated Date - 2022-06-23T00:46:00+05:30 IST