Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆయాసం లేని ఆసనం

ఆంధ్రజ్యోతి(27-05-2020)

సులువుగా, ఆయాసం లేకుండా చేసుకొనే చిన్న చిన్న యోగాసనాలివి. కానీ వీటివల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. భుజాలు, చేతులు, మెడ నరాలు, తుంటి, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీపు కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. ప్రయత్నించండి...


గోముఖాసనం: సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు ఎడమ పాదం కుడి పిరుదుల కింద ఉంచాలి. కుడి మోకాలు ఎడమ మోకాలిపై పెట్టండి. కుడి చేతిని కుడి భుజం పైనుంచి వెనక్కి తీసుకువెళ్లండి. ఎడమ చేయిని పక్క నుంచి వెనక్కి మడవండి. వెనకాల రెండు చేతి వేళ్లనూ ఒకదానితో ఒకటి పట్టుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచి, దీర్ఘ శ్వాస తీసుకొంటూ... వదులుతూ... సాధ్యమైనంతసేపు అదే భంగిమలో ఉండండి. తరువాత కాలు మార్చుతూ ఇలాగే ఐదారుసార్లు చేయండి.


హిప్‌ ట్విస్ట్‌: కూర్చొని కాళ్లు జాపండి. ఇప్పుడు ఎడమ కాలిని పూర్తిగా మడవండి. కుడి పాదాన్ని ఎడమ తొడపై నుంచి తీసుకువచ్చి, నేలపై పెట్టండి. వెన్నెముక, తల నిటారుగా ఉంచి, శ్వాస తీసుకోండి. ఇదే విధంగా కాళ్లు మార్చి చేయండి. ఇలా ఐదుసార్లు ప్రయత్నించండి. 


మార్జాల ఆసనం: మోకాళ్లు,  అరచేతులను నేలపై ఉంచండి. అంటే నాలుగు కాళ్లపై నిలబడ్డట్టు! శ్వాస తీసుకొంటూ, నడుముపై ఒత్తిడి తెస్తూ, కిందకు నెట్టండి. భుజాలు వెనక్కు పెట్టండి. తల పూర్తిగా పైకి లేపండి. తరువాత శ్వాస వదులుతూ నడుమును పైకి ఎత్తండి.  తల కిందకు తీసుకురండి. ఈ చిత్రంలో చూపినట్టు వెన్నెముక వంగాలి. పొట్ట కండరాలు బిగించాలి. ఇలా చేయగలిగినన్ని చేయండి. 

Advertisement
Advertisement