అన్నమయ్య అన్నది - 29

ABN , First Publish Date - 2020-03-13T16:55:53+05:30 IST

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ

అన్నమయ్య అన్నది - 29

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ ఎక్కువగా చదవబడుతున్నదో ఆ‌ స్థాయిలో కవిత్వం‌ చెప్పారు అన్నమయ్య. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక  అంతర్జాతీయ కవి అన్నమయ్య. మనకై‌ ఉన్నది అన్నమయ్య‌ అన్నది. స్మరించుకుందాం రండి --


** 


"ఇదియే వేదాంత మిందుకంటె లేదు
యిదియే శ్రీ వేంకటేశుని మతము"


ఇదిగో ఇదే వేదాంతం ఇందులో‌ ఉన్నదానికంటే ఇంకొకటి లేదు. ఇదే పరమాత్ముని (శ్రీ వేంకటేశుని) మతం‌‌ అని అంటూ అన్నమయ్య ఏది చెప్పాల్సి ఉందో‌‌ దాన్ని ఎలా చెప్పాల్సి ఉందో అలా చెప్పడం ప్రారంభించారు ఈ సంకీర్తన రూపంలో.



వేదంలోని చివరి భాగాన్ని ఉపనిషత్ అంటారు. ఉపనిషత్ అంటే బ్రహ్మ‌జ్ఞానం. "వేద శిరోభాగం" అనీ, "వేదాంతం" అనీ ఉపనిషత్తును అంటారు. "ఉపనిషత్"  లేదా "ఉపనిషద్" అన్నది "సద్" అన్న ధాతువు నుంచి‌ వచ్చింది. "సద్" అంటే "కూర్చోవడం" అని అర్థం. ఈ సద్ కు "ఉప" , "ని" అన్న ఉపసర్గలు‌ కలిశాయి. 


"ఉప" అంటే‌ "దగ్గరితనం" అనీ, "ని"- అంటే "నిష్ఠ" అనీ‌ సూచ్యార్థాలు. గురువు దగ్గర నిష్ఠతో కూర్చుని‌ నేర్చుకున్నది‌ ఉపనిషత్ అవుతుంది. ఉపనిషత్ అన్న శబ్దానికి ఇది‌ వాచ్యార్థం.  ఆవిజ్ఞేయ (mystic or esoteric) జ్ఞానానికి లేదా మార్మిక జ్ఞానానికీ, అధ్యాత్మిక విషయానికీ మూలం ఈ ఉపనిషత్తులే. ఉపనిషత్తులు ఆత్మ , పరమాత్మల ఉనికిపై‌ ఆవశ్యకమైన అవగాహనను అందిస్తాయి. ఈ విషయంలో ఉపనిషత్తులకు సాటిరాగల సాహిత్యం ప్రపంచంలో మఱెక్కడా‌ లేదు‌. ఉపనిషత్తులు, బ్రహ్మా‌ సూత్రాలు భగవద్గీత ఈ మూడూ ప్రస్థానత్రయం‌. బ్రహ్మ‌సూత్రాలు న్యాయప్రస్థానం. భగవద్గీత స్మృతి ప్రస్థానం. ఈ ఉపనిషత్తులు శ్రుతి  ప్రస్థానం. వేదకాలం నాటికి భారత‌ ప్రదేశంలో మతం  అన్నదే లేదు. ప్రపంఛంలో మతం అన్నదే లేని ప్రదేశం‌ వేదకాల భారతదేశం! ‌ మతం లేకుండా భగవచ్చింతనతో వేదకాల భారతదేశం ప్రశాంతంగా ఉండేది!!  మతం ‌అన్న‌‌‌దానికి ఇంగ్లిష్‌ పర్యాయ పదం religion. ఇది లాటిన్‌ భాష పదం. Religion అంటే "కలిపి కట్టడం" అని అర్థం. దేనితో‌ కలిపి కట్టడం? భగవంతుడితో కలిపి‌ కట్టడం. అంటే మనిషిని భగవంతుడితో కలిపి కట్టేది మతం. మఱొకటి కాదు. వేదాంతంలో ఏదైతే‌ ఉందో‌ అది మనిషిని భగవంతుడితో కలిపి కట్టేది. అదే మతం అంటే. అది మాత్రమే మతం అవుతుంది.


"విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియే పో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వెనకవారెల్ల
విరతిఁబొందకున్న వీడదు భవము"


విరతి (ఐహిక విషయాల్లో ఆపేక్ష లేకపోవడం) అన్నదే లాభం, సుఖం, విజ్ఞానం. వెనకటి వాళ్లు ఈ విరతి వల్లే గొప్పవాళ్లయ్యారు. ఈ విరతి అన్నది రాకుంటే సంసారం వీడిపోదు అంటున్నారు అన్నమయ్య మొదటి చరణంలో.

 

అష్టావక్ర గీత (శ్లోకం 2) లో "ముక్తి మిచ్ఛసి  చేత్తాత, విషయాన్విషవత్వజ" అని చెప్పబడ్డది. అంటే నాయనా, నువ్వు విషయాలను విషంలా వదిలేసెయ్ ముక్తిని వాంచిస్తూంటే అని అర్థం. ఎందుకు విరతి అన్నది మనిషికి అవసరం? సరైన సమాధానం భగవద్గీత (అధ్యాయం 5 శ్లోకం 22)లో ఇలా చెప్పబడ్డది. "యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ వీవ తే/ ఆద్యంత వంతః కౌంతేయ న తేషు రమతే బుధః". అంటే ఓ కౌంతేయా, విషయాల వల్ల కలిగే భోగాలు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖానికే కారణాలు. అవి ఆది‌,‌‌అంతాలు కలవి. కనుక జ్ఞాని వాటిల్లో రమించడం లేదు అని అర్థం. ఆ‌ రమించకపోవడమే విరతి అవుతుంది. ఆ విరతినే ఇక్కడ ఆన్నమయ్య చెబుతున్నారు.  


"చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్ధియును
చిత్తమువలెనే శ్రీ హరి నిలుచును
చిత్త శాంతి లేక చేరదు పరము"


అని అంటూ అన్నమయ్య పాప, పుణ్యాలకు మనసే కారణమనీ, మోక్షసిద్ధి‌ కూడా మనసు వల్లే వస్తుందనీ, మనః స్థితికి తగినట్టుగానే భగవంతుడు తెలియవస్తాడనీ, మనసులో‌ శాంతి లేకపోతే పరం అన్నది రాదనీ తెలియజెప్పారు ఇక్కడ. మొదటి చరణంలో విరతి (వైరాగ్యం) గుఱించి చెప్పి‌ ఈ రెండవ చరణంలో‌ మనసు గుఱించి చెప్పారు అన్నమయ్య‌. విరతి లేదా వైరాగ్యం వల్ల స్వాధీనమైన మనసుకు తగ్గట్టుగా భగవంతుడు నిలుస్తాడు ఆ మనసులో శాంతి లేకపోతే పరం అన్నది రాదు అని సూటిగా తెలియజేశారు అన్నమయ్య.


భగవద్గీత (అధ్యాయం 6 శ్లోకం 35)లో ఇలా చెప్పబడింది: "అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్/ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే". అంటే అర్జునా, సందేహం లేదు మనసును నిగ్రహించడం చాలా కష్టం. అది కదులుతూండేది. అభ్యాసం వల్లా, వైరాగ్యం వల్లా అది స్వాధీనమవుతుంది అని అర్థం. "న‌ హ్యస్త్యవిద్యా మనసోSతిరిక్తా మనోహ్యవిద్యా భవబన్ధ హేతుః" అని (వివేకచూడామణి శ్లోకం‌ 171 లో) ఆది శంకరచార్య చెబుతారు‌. అంటే మనసు కన్నా వేఱైన అజ్ఞానం లేదు కదా? అజ్ఞాన రూపమైన మనసు కదా సంసారబంధానికి కారణం అని అర్థం. ఒక పూర్వ సంస్కృత శ్లోకం‌ ఇలా‌ చెబుతోంది: "వాయునాన్ నీయతే  మేఘః పున‌స్తేనైవ నీయతే / మనసా కల్ప్యతే బందో మోక్ష స్తేనైవ కల్ప్యతే". ‌అంటే  గాలి చేత తీసుకురాబడ్డ మేఘాలు  ఆ గాలి వల్లే ఎగరగొట్టబడుతున్నాయి. అలాగే మనసు వల్ల కల్పించబడ్డ బంధం‌ మనసు వల్లే తొలగించబడాలి. మనసు వల్లే మోక్షం కల్పించబడుతుంది అని అర్థం.


ఇక్కడ చిత్తాన్ని గుఱించి అన్నమయ్య మాటల్ని తెలుసుకున్నాక ఒక‌సారి ఇంగ్లిష్ కవి మిల్ ట్న్ జాన్ (Milton John 1608-74) మాటల్ని కూడా నెమరేసుకుందాం. "The mind is its own place, and in itself Can make a heaven of hell, or a hell of a heven''.  


"యెంత చదివినా యెంత వెదికినా
యింతకంటె మరి యిఁకలేదు
యింతకంటె శ్రీ వేంకటేశుదాసులౌట
యెంతవారికైన యిదియే తెరువు"


అని అంటూ  ఎంత‌ చదివినా. ఎంత వెతికినా మొదటి‌, రెండు‌ చరణాల్లో చెప్పబడ్డది ఏదైతో ఉందో అంతకంటే మఱింకేదీ లేదు అనీ,‌ అటు తరువాత భగవంతుడికి దాసులవడమే అనీ,‌ ఎంత‌ వారికైనా ఇదే మార్గమనీ చెబుతూ సంకీర్తన్ని ముగించారు అన్నమయ్య. అనూచానంగా వస్తున్న ఒక‌ సంస్కృత శ్లోకం‌ ఇలా చెబుతోంది: "లోకానువర్తనం త్యక్త్వా , త్యక్త్వా దేహానువర్తనం/ శాస్త్రనువర్తనం త్యక్త్వా , స్వాధ్యాసాపనయం కురు". అంటే లోకాన్ని అనుసరించడం వదిలేయ్యి. దేహాన్ని అనుసరించడం వదిలేయ్యి. శాస్త్రాన్ని అనుసరించడం వదిలెయ్యి.  నేను ఆన్న భ్రాంతిని వదిలెయ్యడాన్ని చెయ్యి‌ అబి అర్థం. భగవంతుడికి దాసులవడమే చెయ్యాల్సింది. భగవంతుడికి దాసులవడాన్నే వేదాంతం బోధిస్తోంది. అలా అవడమే మతం.‌‌ మఱింకొకటి వేదాంతమో,‌ మతమో కాదు.


స్వామి వివేకానంద మతం అంటే ఏమిటో ఇలా చెబుతున్నారు: "మతం అనేది పుస్తకాలలో లేదు‌ మఱి ప్రతిపాదనలలో లేదు, సిద్ధాంతాలలో లేదు, మాట్లాడడంలో లేదు, తర్కంలో కూడా లేదు. అది (మతం) స్థితి ఆపై రూపొందడం. ఓ నా మిత్రులారా, మీలో ప్రతి ఒక్కరూ ఋషి అయేంత వఱకూ, మతవాస్తవాలను కలుసుకునేంత వఱకూ మత జీవితం మీకు మొదలవదు"(Religion is not in books, nor in theories, nor in dogmas, nor in talking, not even in reasoning. It is being and becoming. Ay, my friends, untill each one of you has become a Rishi (Sage) and come face to face with spiritual facts, religious life has not began for you). ఈ వివేకానందోక్తిని‌ అర్థ‌ం‌ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పని చేద్దాం.


విరతి లేదా వైరాగ్యం, ఆ విరతి ఉన్న చిత్తం లేదా మనసు ద్వారా మోక్షసిద్ది కలగుతుందన్నదే వేదాంతం అనీ‌, అంతకు మించింది లేదనీ, అదే  భగవంతుడి మతం అనీ, ఆపై భగవంతుడికి దాసులవడమే మార్గం‌ అనీ తేటతెల్లం చేస్తూ తనరారుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.




ఈ శీర్షికలో ఇంతవఱకూ వచ్చిన రచనల లింక్‌లు
 

ఆ చోటు కోసం మళ్లీ ఇక్కడే పుట్టాలి!


దంచుతున్న ఈ స్త్రీ ఎవరంటే..


తొందరపడి ఆ పని చేయలేదు!


వేంకటేశ్వరుడి నవ్వులు.. ఆమెకు అక్షింతలు! 

 
 
 
 
 
 
 
 

రోచిష్మాన్
9444012279
rochishmon@gmail.com

Updated Date - 2020-03-13T16:55:53+05:30 IST