అన్నమయ్య అన్నది-27

ABN , First Publish Date - 2020-02-28T15:59:58+05:30 IST

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ

అన్నమయ్య అన్నది-27

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ ఎక్కువగా చదవబడుతున్నదో ఆ‌ స్థాయిలో కవిత్వం‌ చెప్పారు అన్నమయ్య. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక  అంతర్జాతీయ కవి అన్నమయ్య. మనకై‌ ఉన్నది అన్నమయ్య‌ అన్నది. స్మరించుకుందాం రండి..


"పరమాత్ముని నోరఁ బాడుచును ఇరు

దరులు గూడఁగ దోసి‌ దంచీ మాయ"

పరమాత్ముణ్ణి నోటితో పాడుతూ రెండువైపులూ కూడేట్టుగా తోస్తూ దంచుతోంది మాయ‌ అంటూ ఒక మార్మికమైన భావనతో అన్నమయ్య ఇలా ఓ సంకీర్తన్ని అందుకున్నారు. (The indescribable power of the infinite) భగవంతుని యొక్క‌ అనిర్వచనీయమైన శక్తి ఈ‌ మాయ గుఱించి ఆదిశంకరులు తమ‌ వివేకచూడామణి (శ్లోకం‌ 111) లో ఇలా‌ చెప్పారు: "సన్నాప్య సన్నాప్యుభయాత్మి కానో భిన్నాప్య భిన్నాప్యుభయాత్మి కానో / సాంఞాప్యసంఞా హ్యుభయాత్మి కానో మహాద్భుతానిర్వచనీయ రూపా". అంటే (మాయ అన్నది) ఉన్నదీ కాదు, లేనిదీ కాదు. ఈ రెండూ కూడా కాదు. ఈ రెండిటికన్నా వేఱైనదీ కాదు. అవయవాలతో ఉన్నదీ కాదు. అవయవాలు లేనట్టిదీ కాదు. ఈ రెండూ కాదు. అనిర్వచనీయమైనది.‌ మహాద్భుతమైనది అని అర్థం. ప్రపంచంలోని ఉన్నతమైన కవులందరూ మార్మికమైన (mystical) రచనలు చేశారు. ఆదిశంకరులు, లావ్ ట్సూ, రూమీ, ఖలీల్ జిబ్రాన్, కబీర్, విల్యం బ్లేయ్క్ (William Blake), విశ్వనాథ సత్యనారాయణ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి కవులు విశేషమైన మార్మికరచనలు‌ చేశారు. ఇల్లిదివో‌ అన్నమయ్య చేసిన ఒక మార్మిక రచన.


"కొలది బ్రహ్మాండపుఁ గుందెనలోన

కులికి జీవులను కొలుచు నించి

కలికి దుర్మోహపు రోకలి వేసి

తలఁచి‌ తనువులను‌ దంచీ మాయ"


చిన్న బ్రహ్మాండం వంటి కుందేన (ధాన్యాన్ని   దంచే ఱోలు పైన ఉండే కుదురు) లో జీవులు అనే ధాన్యాన్ని (కొలుచు) నింపి తాను కదులుతూ దుర్మోహం అన్న రోకలితో బుద్ధిపూర్వకంగా తనువుల్ని దంచుతోంది మాయ అని అంటున్నారు అన్నమయ్య.


"తొంగలి రెప్పల రాత్రులుఁ బగలును

సంగడి కన్నులుగా సరిఁదిప్పుచు

చెంగలించి దిక్కులనే చేతులూచుచు

దంగుడు బియ్యాలుగా దంచీ మాయ"

వాలే రెప్పలున్న రేయీ పగళ్లను జంట కళ్లుగా సరిగ్గా తిప్పుతూ విజృంభిస్తున్న దిక్కులు అనే చేతుల్ని ఊపుతూ దంపుడు బియ్యాన్ని దంచుతున్నట్లుగా దంచుతోంది ‌మాయ అని అంటున్నారు అన్నమయ్య.‌ ఎంత గొప్పగా చెప్పారో గమనించండి. ఒక. విషయాన్ని ఉత్కృష్టమైన కవిత్వంగా  చెప్పడం అంటే ఇదే.  రేయి, పగళ్లను  వాలే రెప్పలున్న కళ్లు‌ అనడమూ, దిక్కుల్ని చేతులుగా‌‌ చెప్పడమూ శ్రేష్టంగా ఉన్నాయి. 


"అనయముఁ దిరువేంకటాధీశ్వరుని

పనుపడి తనలోఁ బాడుచును

వొనరి విన్నాణి జీవులనెడి బియ్యము

తనర నాతనికియ్య దంచీ మాయ‌".


ఎల్లప్పుడూ శ్రీ వేంకటేశ్వరుణ్ణి లేదా పరమాత్ముణ్ణి అలవాటుపడి (పనుపడి) తనలో పాడుకుంటూ ఉండే సన్యాసులైన జీవులు అనే బియ్యం ఫలించగా పరమాత్ముడికి ఇవ్వడానికి దంచుతోంది మాయ అంటూ సంకీర్తన్ని ముగించారు అన్నమయ్య.


పరమాత్ముణ్ణి నోటితో పాడుతూ మాయ అన్నది  జీవులు అనే బియ్యాన్ని లోకం అనే ఱోట్లో వేసి దుర్మోహం అనే ఱోకలితో దంచుతోంది. ఎందుకంటే పరమాత్మకు అలవాటుపడి తమలో పాడుకుంటూ ఉండే తగిన సన్యాసుల్ని ఫలించిన వాళ్లను చేసి పరమాత్మకు చేర్చడం కోసం. దంచడం అన్నది జీవి జీవితంలో  ఆటుపోట్లను కలిగించడానికి ప్రతీక. ఇక్కడ పాడడం అన్నది పరమాత్ముణ్ణి చింతించడం. రవీంద్రనాథ్ ఠాగూర్, రూమీ  వంటి మార్మిక కవులు కూడా పాటనూ, పాడడాన్నీ భక్తి , భగవచ్చింతన అన్న వాటికి ప్రతీకలుగా తీసుకున్నారు. మాయ కూడా పాడుతూనే దంచుతోంది, పాట పాడుకునే సన్యాసుల్ని పరమాత్మకు చేర్చుతోంది. అంటే మాయకు కూడా భగవచ్చింతన ఉంది. మాయకూడా భగవజ్జనితమే. 


మన జనజీవనంలో స్త్రీల దంపుడు పాటలు ఉన్నాయి.‌ వాటిని చూసి ఈ సంకీర్తన్ని అల్లారు అన్నమయ్య. దంచే స్త్రీని మాయగా తీసుకున్నారు ఇక్కడ. అన్నమయ్య సహజకవి. లౌకిక జీవనంలో చలామణిలో ఉన్నదాన్ని తీసుకుని ఇలా మార్మిక‌తను ఆపై పారలౌకికతలను పరిమళింపజేశారు అన్నమయ్య. ఒక మహోన్నతమైన భావం, ఒక మహోన్నతమైన రచనా‌సంవిధానం, ఒక మహోన్నతమైన కవిత్వావిష్కరణం, ఒక మహోన్నతమైన తాత్త్విక చింతనం సమ్మిళితమై ఒక మార్మిక అభివ్యక్తిగా విలసిల్లుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.



ఈ శీర్షికలో ఇంతవఱకూ వచ్చిన రచనల లింక్‌లు
 

తొందరపడి ఆ పని చేయలేదు!


వేంకటేశ్వరుడి నవ్వులు.. ఆమెకు అక్షింతలు! 

 
 
 
 
 
 
 
 



రోచిష్మాన్ 
9444012279
rochishmon@gmail.com

Updated Date - 2020-02-28T15:59:58+05:30 IST