అన్నమయ్య అన్నది - 28

ABN , First Publish Date - 2020-03-06T17:49:00+05:30 IST

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ,

అన్నమయ్య అన్నది -  28

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ ఎక్కువగా చదవబడుతున్నదో ఆ‌ స్థాయిలో కవిత్వం‌ చెప్పారు అన్నమయ్య. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక  అంతర్జాతీయ కవి అన్నమయ్య. మనకై‌ ఉన్నది అన్నమయ్య‌ అన్నది. స్మరించుకుందాం రండి --

**


"ఇదివో‌ శ్రుతి‌ మూల మెదుటనే వున్నది
సదరముగ హరి‌ చాటీ నదివో" 


ఇదిగో వేదానికి మూలమైనది ఎదురుగానే ఉంది. స్పష్టంగా హరి చాటాడు అదిగో అంటూ  ఇదిగో , అదిగో‌‌ లతో ఏది ఏదో తెలియజెప్పడానికి  అన్నమయ్య‌‌ ఈ సంకీర్తన్ని అందుకున్నారు. 


"వేదోఖిలో ధర్మమూలమ్" అని మనుస్మృతి చెప్పింది. వేదం లేదా శ్రుతి ధర్మానికంతా మూలం‌ అని అర్థం. వేదానికి ఉన్న వేఱ్వేరు పేర్లలో శ్రుతి అనే పేరు కూడా ఉంది. "శ్రుతిస్తు వేదో విజ్ఞేయః" అని మనుస్మృతి చెప్పింది. గురువు ఉచ్చరించినదాన్ని విని శిష్యుడు నేర్చుకుంటాడు కనుక శ్రుతి అని పేరు. "వేదో నిత్యమధీయతాం తదుతం కర్మస్వనుష్ఠీయతాం" అని‌ ఆది శంకరాచార్యులు చెప్పారు. అంటే వేదం నిత్యమూ చదవాల్సినది. దాని నుంచి వచ్చిన కర్మ స్వయంగా ఆచరించేందుకు తగినది అని అర్థం. "వేదయతీతి వేదః" అంటే తెలియజేసేది వేదం అనీ, "వేదయతి యతో ధర్మాధర్మ‌‌ ఇతి‌ వేదః‌" అంటే ధర్మ , అధర్మాల్ని తెలియజెప్పేది వేదం అనీ అర్థం. అలాంటి‌ వేదం లేదా శ్రుతికి మూలం అంటే పరమాత్మ ఇదిగో ఎదురుగానే ఉంది హరి దాన్ని‌ చాటాడు అదిగో అని‌ శ్రీ వేంకటేశ్వరుణ్ణి‌ చూపుతున్నారు‌ అన్నమయ్య. 


"ఎనసి పుణ్యము సేసి ఏ లోకమెక్కిన
మనికై‌ భూమి‌ యందు‌‌ మగుడఁ బొడముటే
పొనిగి యా బ్రహ్మ‌ భువనా లోకాః
పునరావృత్తి యనెఁ బురుషోత్తముఁడు"


ప్రయత్నించి‌ పుణ్యాలు చేసి ఏ లోకానికి వెళ్లినా ఛోటు కోసం‌ భూమిపైన మళ్లీ పుట్టాల్సిందే.  యా బ్రహ్మ‌ భువనా లోకాః

పునరావృత్తి అని చెప్పాడు‌ పురుషోత్తముడు (కృష్ణుడు)‌ అని మొదటి చరణం చేశారు అన్నమయ్య.


భగవద్గీత (అధ్యాయం‌ 8 శ్లోకం 16)లో "ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావృత్తినోSర్జునః" అని  కృష్ణుడు చెప్పాడు. అంటే బ్రహ్మభువనం ఆదిగా లోకాలన్నీ మళ్లీ పుట్టే స్వభావం కలిగి ఉన్నవి అని అర్థం. ఆ గీతా వాక్యాన్ని ఇక్కడ ఉటంకించారు అన్నమయ్య. 


"తటుకున శ్రీహరి తన్ను నే కొలిచిన
పటుగతితో మోక్ష పదము సులభమనె
ఘటన మాముపేత్యతు కౌంతేయ మహిని
నటనఁ బునర్జన్మ‌ న విద్యతే"


మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ‌ న విద్యతే  అంటూ త్వరగా తన్నే కొలిస్తే‌ చటుక్కున మోక్ష మార్గం సులభమౌతుందన్నాడు (కృష్ణుడు).అని‌ అన్నమయ్య‌ కొనసాగిస్తూ భగవద్గీతా వాక్యాన్ని ఉంటంకించారు.


మొదటి చరణంలో ఆ గీతా శ్లోకంలోని మోదటి పాదాన్ని ఉటంకించాక అదే శ్లోకంలోని రెండో పాదాన్ని రెండో చరణంలో ఉటంకించారు అన్నమయ్య.


"ఇన్నిటా శ్రీ వేంకటేశ్వరు సేవే
పన్నినగతి నిహ పరసాధన మదే
మన్నించి యాతఁడే మన్మనా భవ యని
అన్నిటా నందఱి కానతిచ్చెఁగాన"


అన్ని వేళల్లోనూ వేంకటేశ్వరుని లేదా పరమాత్మ సేవే చెయ్యాలి. ఇహపర సాధనమదే. పరమాత్ముడే మన్మనా భవ అని అందఱికీ ఆనతి ఇచ్చాడు‌ కదా అని అంటూ సంకీర్తన్ని ముగించారు అన్నమయ్య.


భగవద్గీత (అధ్యాయం 18‌ శ్లోకం 65)లో‌ "మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు" అని కృష్ణుడు‌ ఆనతి ఇచ్చాడు. అంటే నాపై మనస్సు కలవాడివిగానూ, నా భక్తుడివిగానూ, నా అభ్యర్థిగానూ ఉండు. నన్ను పూజించు అని అర్థం. ఇలా‌ పరమాత్మ ఆనతి ఇచ్చాడు కదా? అందుకే అన్ని వేళల్లోనూ వేంకటేశ్వరుని లేదా పరమాత్మ సేవే చెయ్యాలి. ఇహపర సాధనమదే అని వక్కాణించారు అన్నమయ్య.


కొన్ని ఇతర‌ సంకీర్తనల్లో భగవద్గీత భావాల్ని తన మాటల్లో తీసుకొచ్చి చెప్పిన అన్నమయ్య ఈ‌ సంకీర్తనలో‌‌ కొన్ని భగవద్గీత‌ శ్లోక వాక్యాల్ని యథాతథంగా ఉటంకించారు. 


నేరుగా భగవద్గీతా వాక్యాల‌ను ఉటంకిస్తూ‌ తనదైన‌ సౌరుతో‌ శ్రుతికి మూలం పరమాత్ముడే అన్న సత్యాన్ని నినదించే ఓ ఉత్కృతై ఉన్నది‌ ఇలా అన్నమయ్య అన్నది.




ఈ శీర్షికలో ఇంతవఱకూ వచ్చిన రచనల లింక్‌లు
 

దంచుతున్న ఈ స్త్రీ ఎవరంటే..


తొందరపడి ఆ పని చేయలేదు!


వేంకటేశ్వరుడి నవ్వులు.. ఆమెకు అక్షింతలు! 

 
 
 
 
 
 
 
 

రోచిష్మాన్

9444012279

rochishmon@gmail.com


Updated Date - 2020-03-06T17:49:00+05:30 IST