Half Body Girl: 15 ఏళ్ల క్రితం నడుము వరకే దేహంతో పుట్టిన ఓ బాలిక.. ఇప్పుడు వార్తల్లో నిలవడం వెనుక..

ABN , First Publish Date - 2022-08-17T20:07:20+05:30 IST

ఈ ప్రపంచంలో ఆత్మ విశ్వాసాన్ని మించిన గొప్ప శక్తి మరొకటి లేదు. తనపై తనకు నమ్మకం ఉంటే ఎంత పెద్ద కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించవచ్చు

Half Body Girl: 15 ఏళ్ల క్రితం నడుము వరకే దేహంతో పుట్టిన ఓ బాలిక.. ఇప్పుడు వార్తల్లో నిలవడం వెనుక..

ఈ ప్రపంచంలో ఆత్మ విశ్వాసాన్ని మించిన గొప్ప శక్తి మరొకటి లేదు. తనపై తనకు నమ్మకం ఉంటే ఎంత పెద్ద కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించవచ్చు. ఆత్మవిశ్వాసం ఉంటే కాళ్లు, చేతులు లేకపోయినా ఘన విజయాలు సాధించవచ్చని ఎంతో మంది నిరూపించారు. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లోని పాలి జిల్లా రాయ్‌పూర్‌ సమీపంలోని సుమైల్‌ గ్రామానికి చెందిన సుమన్‌ బానో అనే బాలిక కూడా ఆ విషయాన్ని రుజువు చేసింది.


పదిహేనేళ్ల క్రితం ఆ బాలిక జన్మించినపుడు, ఆమెను చూసి తల్లిదండ్రులు ఎంతో కుంగిపోయారు. ఎందుకంటే ఆ చిన్నారికి నడుము కింద భాగం (Half Body Girl) లేదు. జన్యు లోపాల వల్ల ఆమె సగం శరీరంతోనే జన్మించింది. వైద్యులు కూడా ఆమె శరీరాన్ని సరి చేయలేకపోయారు. ప్రస్తుతం సుమన్‌కి 15 ఏళ్లు.  సగం శరీరం లేకపోయినా ఆమె మనోధైర్యంతో ముందడుగు వేసింది. బలహీనతను తన శక్తిగా మార్చుకుంది.  కాళ్లు లేకపోయినా ఆ బాలిక చాలా చక్కగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అమ్మాయి ఎలా బ్రతుకుతుందో అని మథనపడిన తల్లిదండ్రుల్లో సుమన్ భరోసా నింపింది. 


ఇది కూడా చదవండి..

Shocking: వేప చెట్టు నుంచి బయటకు వస్తున్న పాలు.. పూజలు చేస్తున్న గ్రామస్తులు.. అసలు విషయం బయటపెట్టిన ప్రొఫెసర్


`ఆరు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నేను ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉన్నానని అర్థం చేసుకున్నాను. మిగతా పిల్లలు ఆడుకోవడాన్ని, పరిగెత్తడాన్ని, గెంతడాన్ని నేను మంచం మీద పడుకుని చూసేదాన్ని. నేను వారి లాగ చేయలేనని అర్థమైంది. కొంచెం పెద్దయ్యాక అమ్మ నన్ను ఎత్తుకుని బడికి తీసుకెళ్లేది. ఆ తర్వాత మెల్లగా నేనే నడవడం మొదలుపెట్టాను. నన్ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయేవారు. కొందరు నవ్వుకునేవారు. కొందరు జాలి చూపేవారు. చాలా మంది కళ్లల్లో, మాటల్లో నా పట్ల సానుభూతి కనిపించేది. అయితే ఎవరి జాలికి, సానుభూతికి గురి కాకూడదనుకున్నాను. అందుకే నా బలహీనతను బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను.


నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ కాళ్లు లేకుంటే డ్యాన్స్ చేయడం కుదరదు. అయినా టీవీ, యూట్యూబ్ ఛానల్స్ చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను. నేను స్టేజ్‌పైకి వెళ్లినప్పుడల్లా ప్రజలు నన్ను చూసి నవ్వుతారని నాకు తెలుసు. అయితే నేను అలాంటి వారిని ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను నృత్యం చేస్తున్నప్పుడు, నా బలహీనతను మరచిపోతాను. నేను ఏమైనా చేయగలను అని మాత్రమే అనుకుంటున్నాను. నేను కష్టపడి చదువుతాను. ఐయేఎస్ అవ్వాలనేది నా కోరిక. నాలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాన`ని సుమన్ చెప్పింది. 

Updated Date - 2022-08-17T20:07:20+05:30 IST