13 తర్వాత వాయుగుండం
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:46 AM
బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. 12వ తేదీ నాటికి థాయ్‌లాండ్ పరిసరాల నుంచి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ఉపరితల ఆవర్తనం ప్రవేశించనుంది.
వాతావరణ శాఖ అంచనా.. తుఫాన్‌గా మారే అవకాశం
కోస్తాంధ్ర, ఒడిశాలో వర్షాలు.. ఈ వారం చివరికి స్పష్టత
వాతావరణ నిపుణుల వెల్లడి
విశాఖపట్నం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. 12వ తేదీ నాటికి థాయ్‌లాండ్ పరిసరాల నుంచి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ఉపరితల ఆవర్తనం ప్రవేశించనుంది. దీని ప్రభావంతో 13న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండు వారాల్లో దేశంలో వాతావరణ మార్పులకు సంబంధించి గురువారం బులెటిన్ విడుదల చేసింది. అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే క్రమంలో దక్షిణ, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని అంచనా వేసింది. ఆ తరువాత వాయుగుండం బలపడి తుఫాన్‌గా మారుతుందా?, ఒడిశా లేదా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందా?... అనే స్పష్టత ఐఎండీ ఇవ్వలేదు. అయితే కొందరు వాతావరణ నిపుణులు మాత్రం ఒడిశా, కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వారం చివరి కల్లా మరింత కచ్చితమైన సమాచారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గురువారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. మార్కాపురం మండలం రావిపాడులో 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఎండలు కొనసాగుతాయని, అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు