తెలంగాణకు 'ఆర్నబ్' తుపాను అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 08:37 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను ఆర్నబ్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. యానాం సమీపంలో తుపాను తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
హైదరాబాద్, అక్టోబర్ 28: బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను ఆర్నబ్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. యానాం సమీపంలో తుపాను తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్రమత్తమైంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు.. తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత కూడా పెరుగుతోంది. వర్షాలు, చలి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల విషయంలో వాతావరణ పరిస్థితులను గమనించాలని, ప్రయాణికులు రహదారులపై నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. తుపాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు