22 రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే 2 రోజుల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు..
ABN , Publish Date - Jun 28 , 2026 | 02:57 PM
రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం దేశంలోని 22 రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. ఇవాళ యూపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, గతేడాది కంటే 9 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు యూపీలోకి ఎంట్రీ ఇస్తున్నాయని వెల్లడించింది. గత 16 రోజులుగా బిహార్ సరిహద్దు వద్దే రుతుపవనాలు ఆగిపోయాయని ఐఎండీ తెలిపింది.
రాజస్థాన్ సహా ఏడు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా నమోదు అవుతున్నాయని వెల్లడించింది. రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అసోం, మేఘాలయ, బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సిక్కిం, గోవా, కర్ణాటక రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జార్ఖండ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మధ్య ప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. జూన్ 28వ తేదీనుంచి 2వ తేదీ వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
పీవీ నరసింహారావుకు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ ఘన నివాళులు
అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరిని గమనిస్తు్న్న ప్రజలు: మంత్రి రాంప్రసాద్