Share News

కోస్తాకు మరో తుఫాన్‌ ముప్పు?

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:08 AM

రెండు వరుస తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన కోస్తాంధ్రకు మరో తుఫాన్‌ గండం పొంచి ఉంది. అయితే, ఇది తుఫాన్‌గానే తీరం దాటుతుందా? లేదా?...

కోస్తాకు మరో తుఫాన్‌ ముప్పు?

  • ఎల్లుండి అల్పపీడనం..

  • 15కు వాయుగుండంగా మార్పు

  • 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తా, తమిళనాడు మధ్య తీరంపైకి..

విశాఖపట్నం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రెండు వరుస తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయిన కోస్తాంధ్రకు మరో తుఫాన్‌ గండం పొంచి ఉంది. అయితే, ఇది తుఫాన్‌గానే తీరం దాటుతుందా? లేదా?...అన్నది నిపుణులు ఇంకా స్పష్టం చేయడం లేదు. ఇప్పటి వరకూ ఉన్న అంచనా ప్రకారం తుఫాన్‌ లేదా తీవ్రవాయుగుండం ఈ నెల 16, 17 తేదీల్లో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని పలు వాతావరణ మోడల్స్‌ అంచనా వేస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.

ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. పదిహేనో తేదీ నాటికి వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. అది మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని పలు వాతావరణ మోడల్స్‌ అంచనా వేస్తున్నాయి. అయితే, భూ ఉపరితలం నుంచి సముద్రం వైపు పొడి గాలులు వీస్తున్నందున తుఫాన్‌ తీరం దాటకముందే సముద్రంలో కొంత బలహీనపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా 16, 17 తేదీల్లో ఒంగోలు, చెన్నై, పుదుచ్చేరి వద్ద తీరం దాటే అవకాశం ఉందన్నారు.

పెరిగిన చలి

రాష్ట్రంలో చలి పెరిగింది. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో మంగళవారం ఉదయం చలి గాలులు వీయడంతోపాటు కొన్నిచోట్ల మంచు కురిసింది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని, చలి స్వల్పంగా పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:08 AM