19న అల్పపీడనం
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:01 AM
ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమంగా పయనించి 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో 19సాయంత్రం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
23 నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తీరం దాటే చాన్స్.. కోస్తాకు భారీ వర్షాలు?
విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉత్తర థాయ్‌లాండ్ పరిసరాల్లో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమంగా పయనించి 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో 19సాయంత్రం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఈ క్రమంలో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి, అనంతరం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఒడిశా, కోస్తా, ఇంకా రాయలసీమలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఈనెల 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉపరితల ఆవర్తనం ఉంది. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల బుధవారం వర్షాలు కురిశాయి. కాకినాడ జిల్లా రౌతులపూడిలో 6.87, అనకాపల్లి జిల్లా ఇ.మర్రిపాలెంలో 5.4, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 4.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గురువారం అల్లూరి, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య