రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ABN , Publish Date - Jun 08 , 2026 | 07:30 PM
రాష్ట్రంలో రేపు (మంగళవారం) అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
అమరావతి, జూన్08: రాష్ట్రంలో రేపు (మంగళవారం) అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉందంది. ఇక కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు పడతాయని తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వైఎస్సార్ కడప జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాల కురుస్తాయని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడ వద్దని ప్రజలకు స్పష్టం చేసింది. అలాగే భారీ హోర్డింగ్స్ ప్రాంతాల్లో ఉండ వద్దని ప్రజలకు తెలిపింది.
రైతులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు వినిపించగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్పష్టం చేసింది. తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో 42 - 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగనుందని తెలిపింది.
పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 40 - 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నెలకొంటాయని చెప్పింది. బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత కొనసాగనుందని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అయితే సోమవారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరులో 41.7 డిగ్రీలు, చిట్యాలలో 41.4 డిగ్రీలు, ఎస్. రాయవరంలో 41.2 డిగ్రీలు, పెదపారుపూడిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయిందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.