దంచికొడుతున్న ఎండలు.. అలర్ట్ జారీ చేసిన ఏపీఎస్‌డీఎంఏ..
ABN , Publish Date - May 17 , 2026 | 09:11 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రతపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రతపై ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు (ఆదివారం) మార్కాపురం జిల్లా కంభంలో అత్యధికంగా 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. సోమవారం నాడు 15 జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ మేరకు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కూడా ఎండ హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. సోమవారం 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలు, విజయనగరం జిల్లాలో 10 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో 11 మండలాలకు అలర్ట్ జారీ చేశారు. మరో 21 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం నాడు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని.. 245 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు ఎండలో తిరగొద్దని హెచ్చరించారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించారు.
మరోవైపు విదర్భ నుంచి మన్నార్ వరకూ ద్రోణి విస్తరించినట్లు ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు మన్యం, అల్లూరి, పోలవరం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడనున్నట్లు తెలిపారు. అయితే, ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద ఎవరూ నిలపడొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ ‘డైనో డీట్స్’ ప్రారంభం.. స్పందించిన లోకేశ్
పదో తరగతి విద్యార్థులకు మంత్రి టీజీ భరత్ ప్రత్యేక విందు..