Share News

కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు అలర్ట్.. ఆ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి..

ABN , Publish Date - May 19 , 2026 | 08:01 PM

కోస్తాంధ్ర జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర ఎండలు, వడగాలుల పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 19 నుంచి 'ఫీల్స్ లైక్' ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.

కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు అలర్ట్.. ఆ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి..
AP Weather Report

అమరావతి: కోస్తాంధ్ర జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర ఎండలు, వడగాలుల పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 19 నుంచి 'ఫీల్స్ లైక్' ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మే 20 నుంచి 26 వరకు ఉత్తర, మధ్య కోస్తా జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.


ఈ నేపథ్యంలో పట్టణ, స్థానిక సంస్థలకు ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడు రోజుల పాటు హీట్ వేవ్ సన్నద్ధత చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించింది. ప్రజలకు హీట్ వేవ్ అలర్ట్‌లు, జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, వాట్సాప్, సోషల్ మీడియా, కేబుల్ నెట్‌వర్క్‌ల ద్వారా హెచ్చరికలు అందించాలని ఆదేశించింది. బస్టాండ్లు, మార్కెట్లు, ఆస్పత్రుల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలని.. అవసరమైతే చలివేంద్రాలు, తాత్కాలిక నీటి కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కమ్యూనిటీ హాళ్లు, వార్డు సచివాలయాల్లో కూలింగ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని, బస్ స్టాప్‌లు, మార్కెట్లు, జంక్షన్లలో నీడ సదుపాయాలు కల్పించాలని సూచించింది.


వృద్ధులు, నిరాశ్రయులు, కార్మికుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. మధ్యాహ్న వేళల్లో బయటి పనులు తగ్గించాలని, ఫీల్డ్ పనులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నిర్వహించుకోవాలని సూచించింది. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపింది. తాగునీటి నాణ్యత పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. హీట్ వేవ్ ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్‌లు యాక్టివ్‌గా ఉంచాలని, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించింది. వార్డు స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలనీ ఆదేశించింది.


జంతువులు, పక్షుల కోసం నీటి పాత్రలు ఏర్పాటు చేయాలని, హీట్ వేవ్ పరిస్థితులను ప్రతిరోజూ సమీక్షించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించింది. అత్యవసర పరిస్థితులను వెంటనే జిల్లా యంత్రాంగానికి నివేదించాలని వారికి స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేశ్ కుమార్ మెమో జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆస్పత్రులకు భారీగా నిధుల విడుదల

పోలీస్ వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Updated Date - May 19 , 2026 | 08:10 PM