Share News

చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:48 AM

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.

చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు

  • నెల్లూరు జిల్లా కలిచేడులో 9.25 సెంటీమీటర్ల వాన

  • రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా కలిచేడులో అత్యధికంగా 9.25, కాకినాడ జిల్లా రౌతులపూడిలో 6.42, తిరుపతి జిల్లా కలుగుప్తపాడులో 6.34, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 5.6, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 4.84 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే, మంగళవారం వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, రానున్న నాలుగైదు రోజులు కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం అల్లూరి, పోలవరం, కోనసీమ, ఎన్టీఆర్‌, పల్నాడు, మార్కాపురం, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 03:48 AM