కొండా చూపు.. గులాబీ వైపు!?
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:40 AM
మంత్రి పదవి కోల్పోయిన అనంతరం కొండా సురేఖ, మురళీధర్‌రావు దంపతుల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది. మంత్రి పదవి పోయినా తాను కాంగ్రె్‌సలోనే ఉంటానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటించిన సురేఖ.. కొన్ని గంటల్లోనే కేసీఆర్ మంచివారంటూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ మంచివారంటూ సురేఖ ప్రశంస
కొండా ఫ్యామిలీ బీఆర్‌ఎస్‌లోకి.. అని చర్చ
గులాబీ ట్రబుల్ షూటర్ ద్వారా
సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రచారం
కొండా దంపతులకు బీజేపీ ఆహ్వానం!
పార్టీ మారడంపై కొండా తర్జనభర్జన
సురేఖను బీఆర్‌ఎ్‌సలోకి రానివ్వం
తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినీ తీసుకోం
మాజీమంత్రి జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు
వరంగల్/హైదరాబాద్/బంజారాహిల్స్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మంత్రి పదవి కోల్పోయిన అనంతరం కొండా సురేఖ, మురళీధర్‌రావు దంపతుల రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది. మంత్రి పదవి పోయినా తాను కాంగ్రె్‌సలోనే ఉంటానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటించిన సురేఖ.. కొన్ని గంటల్లోనే కేసీఆర్ మంచివారంటూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కొండా దంపతులు బీఆర్‌ఎ్‌సలో చేరుతారనే ఊహగానాలు మొదలయ్యాయి. గులాబీ పార్టీ కీలక నేతలు ఇప్పటికే కొండా దంపతులతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ కూడా కొండా దంపతులకు ఆహ్వానం పలుకుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికిప్పుడు పార్టీ మారాలా, వేచి చూడాలా అన్నదానిపై కొండా దంపతులు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.
ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి?
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఓ మీడియా చానెల్‌లో మాట్లాడిన కొండా సురేఖ.. మాజీ సీఎం కేసీఆర్ చాలా మంచివారని, హుందాగా వ్యవహరిస్తారని.. తమను ఎప్పుడు ఒక్కమాట కూడా అనలేదని పేర్కొన్నారు. అంతేకాదు తాము అడిగిన వెంటనే కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు. ఉన్నట్టుండి ఇలా సానుకూల వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమేమిటన్న చర్చ జరుగుతోంది. 2014లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ నుంచి కొండా సురేఖ బీఆర్‌ఎ్‌సలో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మంత్రి పదవి రాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల బీఆర్‌ఎస్ అభ్యర్థుల రెండో జాబితాలోనూ తన పేరు ప్రకటించకపోవడంతో.. సురేఖ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్‌లో ఇబ్బందికర పరిస్థితులతో.. కొండా దంపతుల చూపు గులాబీ వైపు మళ్లిందనే చర్చ మొదలైంది. బీఆర్‌ఎ్‌సలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో కొండా దంపతులతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ మంత్రిగా ఉన్న సమయంలో కొండా సురేఖ కేటీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారు. దానిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సురేఖ బీఆర్‌ఎస్‌లోకి రావడాన్ని కేటీఆర్ స్వాగతిస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది
గ్రేటర్ వరంగల్, గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ప్రభావమెంత?
త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఎన్నికలపై కొండా దంపతుల ప్రభావం ఎంతవరకు ఉంటుందనే కోణంలో ఆయా పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో 66 డివిజన్లు ఉండగా.. అందులో 25 వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. అంతేకాదు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీకి వీలుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లతో సంబంధం లేకుండా ప్రత్యేక టీమ్‌ను కొండా దంపతులు సిద్ధం చేసుకున్నారనే చర్చ ఉంది. ఇక తమ కుమార్తె కొండా సుస్మితను రాజకీయాల్లో క్రియాశీలకం చేయడానికి ఈ ఎన్నికలను వినియోగించుకోనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలతో కొండా దంపతులు చర్చలు జరిపినట్టు సమాచారం.
కొండా మాజీ ఓఎస్డీ కేసులో
ముగ్గురికి పోలీసు కస్టడీ
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్, మరికొందరిపై నమోదైన హత్యాయత్నం కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులు బత్తిని అరుణ్‌కుమార్, ముత్యాల మహేందర్‌రెడ్డి, పసుపులేటి కార్తిక్‌కుమార్‌లను పోలీసులు శుక్రవారం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. సుమంత్ ఆచూకీ, ఇతర వివరాలపై వారిని ప్రశ్నించారు.
కొండా సురేఖకు భద్రత కుదింపు
కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో.. ఇప్పటి వరకు ఆమెకు మంత్రి హోదాలో ఇచ్చిన సౌకర్యాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. ఆమెకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అధికారులు శుక్రవారం వెనక్కి తీసుకున్నారని.. హైదరాబాద్, హన్మకొండలోని ఆమె నివాసాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు రక్షణను తొలగించారని తెలిసింది. మంత్రి హోదాలో కేటాయించిన గన్‌మన్లను తగ్గించి, ఎమ్మెల్యే హోదాకు తగిన మేర కొనసాగిస్తున్నారని సమాచారం.