విటమిన్ల లోపం.. వృద్ధులకు శాపం
ABN , Publish Date - Aug 18 , 2026 | 06:45 AM
విటమిన్ల లోపం పెద్ద వయసువారికి శాపంగా మారుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) - జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు...
ప్రతి ముగ్గురిలో ఒకరికి మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్
డి, బి2, బి9, బి12 లోపాలతో మందగిస్తున్న మెదడు
హైదరాబాద్‌లో 55-85 ఏళ్లవారిపై
ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ అధ్యయనంలో వెల్లడి
పోషకాహారంతో జ్ఞాపకశక్తి పదిలం అంటున్న శాస్త్రవేత్తలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): విటమిన్ల లోపం పెద్ద వయసువారికి శాపంగా మారుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) - జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విటమిన్ లోపాల కారణంగా మెదడు చురుకుదనం సన్నగిల్లడమే కాక.. మతిమరుపు, ఏకాగ్రత లోపం, ఆలోచనశక్తి సన్నగిల్లడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, స్థలకాలాదులను గుర్తించలేని అయోమయస్థితి ఏర్పడడం వంటి సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయని వారి అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా వయోధికుల్లో స్వల్ప మతిమరుపు, డిమెన్షియాకు మధ్య మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్ (ఎంసీఐ)స్థితి ఒకటి ఉంటుంది. ఆ సమయంలో కనుక సమస్యను గుర్తిస్తే డిమెన్షియాను చాలా సులభంగా నియంత్రించవచ్చని ఆ అధ్యయనం నిరూపించింది. అంతేకాదు, మెదడు ఆరోగ్యానికి విటమిన్లకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా వెల్లడించింది. ఈ అధ్యయనంలో భాగంగా ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్‌కు చెందిన డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి నేతృత్వంలోని బృందం.. నగరంలోని 55 నుంచి 85 ఏళ్ల మధ్యవయస్కులు 184మంది రక్తనమూనాలను సేకరించి.. ఏ, డీ, బీ1, బీ2, బీ6, బీ9, బీ12 విటమిన్ల స్థాయులను పరీక్షించింది. మాంట్రియల్ కాగ్నెటివ్ అసె్‌సమెంట్ ద్వారా వారి మెదడు పనితీరు సామర్థ్యాన్ని అంచనా వేసింది. రక్తనమూనాలు ఇచ్చినవారిలో 36.4శాతం మందిలో స్వల్పమైన మతిమరుపు (ఎంసీఐ) సమస్య గుర్తించినట్లు ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు తెలిపారు. మరీ ముఖ్యంగా.. డీ, బీ2, బీ9, బీ12 లోపాలున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపించినట్లు డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి వివరించారు. దానికి తోడు ఎంసీఐను ఎదుర్కొంటున్న వారిలో అధిక రక్తపోటు, మధుమేహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే డీ, బీ6, బీ12 విటమిన్లు అధికస్థాయిలో ఉన్నవ్యక్తుల్లో మతిమరుపు వంటి లోపాలేమీ లేకుండా వారి మెదడు పనితీరు చాలా చురుగ్గా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. విటమిన్ల లోపాన్ని ముందస్తుగా గుర్తించి తగిన పోషకాహారం, డాక్టర్ల సూచనతో విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి సూచించారు. యాభై ఏళ్లు దాటిన వారు కనీసం ఏడాదికి ఒకసారైనా వైద్యపరీక్షలు చేయించుకుని.. విటమిన్ల లోపాన్ని గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా