బహుజన బతుకమ్మ అందరూ కలిసి జరుపుకోవాలి: విమలక్క
ABN , Publish Date - Oct 11 , 2026 | 08:16 PM
బహుజన బతుకమ్మను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవాలని కామ్రేడ్ విమలక్క పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 11: బహుజన బతుకమ్మ సంబరాల్లో భాగంగా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలోని మల్లెల మడుగు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కామ్రేడ్ విమలక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను అందరూ కలిసి జరుపుకోవాలని.. లౌకిక పండుగగా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు.
పంటలకు ఎలాంటి అంటరానితనం లేనట్లే బతుకమ్మ పండుగకు కూడా ఎలాంటి వివక్ష ఉండకూడదని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా మహిళలంతా కలిసి పండుగను జరుపుకోవాలని అన్నారు. ఢిల్లీలో యువత చేపట్టిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని తాము భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని విమలక్క ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు.. జెన్ జి యువత కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడంతో పాటు రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమిష్టి కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. మరోవైపు రసాయనాల వినియోగంతో పంటలు పండించడం వల్ల భూమి కలుషితమవుతోందని.. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. యువత ఆకాంక్షలు, రైతుల సమస్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని విమలక్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News