8 సార్లు అధిష్ఠానానికి ఎన్ని డబ్బులిచ్చావు?
ABN , Publish Date - Aug 18 , 2026 | 07:14 AM
తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో నిరూపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా...
చిన్నారెడ్డిని నిలదీసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
పార్టీ, సీఎంను కించపర్చే మాటలు సరికాదు
నేను ఎవరికి డబ్బులిచ్చానో నిరూపించాలి
బీఆర్‌ఎస్ నేతలతో ఆయన
అంటకాగుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి
అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తా: వనపర్తి ఎమ్మెల్యే
వనపర్తి టౌన్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తాను ఎవరికి డబ్బులు ఇచ్చానో నిరూపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన 8 సార్లు అధిష్ఠానానికి ఆయన ఎంత డబ్బు ఇచ్చి టికెట్ తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై సోమవారం మేఘారెడ్డి స్పందించారు. వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డి గోపాల్‌పేట సభలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. బీఫాం ఇచ్చి లాగేసుకున్నారని అధిష్ఠానంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే జయరాములును కాదని ఆయనకు బీఫాం ఎలా ఇచ్చారో వివరించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలు మేఘారెడ్డిని కోరుకుంటేనే పార్టీ గుర్తించి బీఫాం ఇచ్చిందని చెప్పారు. డబ్బులకు బీఫాంలు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉందా? అని నిలదీశారు. దీనిపై చిన్నారెడ్డి ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడని గౌరవిస్తున్నామని, ఆయన మాత్రం పార్టీపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేసుకుంటూ తిరగడం భావ్యం కాదని హితవు పలికారు. ప్రణాళికా సంఘం పదవి రెన్యువల్ కోసమే పార్టీని, సీఎంను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. గడిచిన 30 నెలల నుంచి ఖిల్లాఘనఫురం, పెద్దమందడి, గోపాల్‌పేట, పెబ్బేరు, వనపర్తి టౌన్‌కు సంబంధించిన బీఆర్‌ఎస్ నాయకులను వెంటేసుకొని సెక్రటేరియట్‌లో బిల్లులు చేయించే పైరవీలు చేస్తున్నాడని, వారి కోసం పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో కార్యాలయాలకు ఫోన్‌లు చేసి పనులు చక్కబెడుతున్నాడని ఆరోపించారు. చిన్నారెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి నియోజకవర్గంలో ఎమ్మెల్యేను కాదని పెత్తనం చేస్తానంటే కుదరదని మేఘారెడ్డి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అన్ని అధారాలతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మీనాక్షి నటరాజన్, రాహుల్, సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్లు రవిని ఆయన కలిశారు. చిన్నారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారెడ్డిని వారంలోగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేదంటే కార్యకర్తలతో కలిసి గాంధీభవన్‌ను ముట్టడిస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా