మిర్యాలగూడలో పెను విషాదం.. సిలిండర్ పేలి ముగ్గురి మృతి
ABN , Publish Date - Jun 05 , 2026 | 06:57 AM
మిర్యాలగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు కుటుంబసభ్యులు సజీవ దహనం అయ్యారు.
నల్గొండ, జూన్ 5: మిర్యాలగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు కుటుంబసభ్యులు సజీవ దహనం అయ్యారు. అమ్మమ్మ, మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలాల్‌వాడకు చెందిన చంద్రకళ, సైదులు భార్యాభర్తలు. సైదులు అనారోగ్యం కారణంగా నెలరోజుల క్రితం చనిపోయాడు. చంద్రకళ పెద్ద కూతురు ధనమ్మ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ధనమ్మ తన ఇద్దరు పిల్లలు లక్ష్మణ్(16), ప్రణతి(14)తో పుట్టింట్లోనే ఉంటోంది.
మూడు రోజుల క్రితం ఇళ్లలో పని చేసేందుకు పుణె వెళ్లింది. గురువారం రాత్రి చంద్రకళ.. మనవడు, మనవరాలితో ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ అయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ముగ్గురూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయకచర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మారుతి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారొచ్చేసింది!