Share News

పరిశోధనాత్మక విద్యాబోధన

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:15 AM

మాతృభాషలో బోధన.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం, డిజిటల్‌ సాంకేతికతను బోధనలో సమర్థంగా వినియోగించడం వియత్నాం విద్యా విధానంలో కీలకాంశాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

పరిశోధనాత్మక విద్యాబోధన
tg govt

  • వియత్నాం విద్యావిధానంపై

  • తెలంగాణ అధికారుల అధ్యయనం

  • తెలంగాణలో అమలు చేయటంపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక

హైదరాబాద్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మాతృభాషలో బోధన.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం, డిజిటల్‌ సాంకేతికతను బోధనలో సమర్థంగా వినియోగించడం వియత్నాం విద్యా విధానంలో కీలకాంశాలని తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్కడి విద్యావిధానాన్ని పరిశీలించేందుకు పాఠశాల విద్య ఉన్నతాధికారులు, పలువురు ఉపాధ్యాయులతో కూడిన బృందం ఇటీవల వారంపాటు వియత్నాంలో పర్యటించింది. వియత్నాం ఎడ్యుకేషన్‌ స్ట్రాటజీ అండ్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ (వీఈఎ్‌సపీఐ) అధికారులతో వీరు చర్చలు జరిపారు. అక్కడి పాఠశాల విద్యావ్యవస్థ, పాఠ్యప్రణాళిక రూపకల్పన, బోధన, మూల్యాంకన పద్ధతులను పరిశీలించారు. విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలు, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్య లేదా వృత్తి విద్యను ఎంచుకునే అవకాశం అక్కడ ఉందని తెలిపారు. వియత్నాం విద్య, శిక్షణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో జాతీయ పాఠ్యప్రణాళిక అమలవుతోంది. తరగతి గదుల్లో డిజిటల్‌ వనరులు, సాంకేతిక పరికరాల వినియోగానికి అక్కడ ప్రాధాన్యమిస్తున్నట్లు బృందంలోని సభ్యులు తెలిపారు. డిజిటల్‌ పాఠ్యాంశాలు, పరస్పర భాగస్వామ్యంతో కూడిన బోధన ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, చురుకుదనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి వియత్నాం విద్యావ్యవస్థ ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. విద్యా ప్రతిభతోపాటు స్నేహభావం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, బాధ్యత, సృజనాత్మకత అనే ఐదు ప్రధాన లక్షణాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఒకటో తరగతి నుంచే శారీరక విద్య, సంగీతం, కళలకు పాఠ్యప్రణాళికలో స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. అక్కడ 99 శాతం ప్రభుత్వ పాఠశాలలేనని, వాటిలో వసతులు కూడా అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూనే మూడో తరగతి నుంచి ఇంగ్లీష్ ను విదేశీ భాషగా బోధిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థి కేంద్రంగా బోధన జరుగుతున్నట్లు తెలిపారు. అక్కడి ఉత్తమమైన విధానాలను తెలంగాణలో అమలుచేయటంపై నివేదికను ఈ బృందం ప్రభుత్వానికి సమర్పించనుంది.

Updated Date - Oct 22 , 2026 | 05:15 AM