తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం
ABN , Publish Date - May 28 , 2026 | 03:42 AM
ఉత్తర తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందించేందుకు వీలున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌లకు సాగు, తాగునీరు అవసరం
148 మీటర్ల ఎత్తుతో ప్రయోజనం తక్కువ
కొంత ఎత్తు పెంచితేనే గ్రావిటీతో నీళ్లు
మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే ఉంటుంది
ప్రజావసరాల దృష్ట్యా దీనిపై చర్చ అవసరం
అనుకూలమైన తేదీ ఖరారు చేయండి
మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌కు సీఎం రేవంత్ లేఖ
కనీసం 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలని యోచిస్తున్న సర్కారు
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ఉత్తర తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందించేందుకు వీలున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా తలపెట్టిన ఈ బ్యారేజీ ఎత్తు పెంచుకునే అంశంలో మహారాష్ట్రతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా లేఖ రాశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అనుకూలమైన తేదీని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ (పూర్తి నీటి నిల్వ స్థాయి)తో తుమ్మిడిహెట్టిని నిర్మిస్తే.. ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవన్న నిపుణుల సూచనల నేపథ్యంలో.. బ్యారేజీ ఎత్తుపై మరోసారి చర్చ అవసరమని లేఖలో ఫడణవీస్‌కు సీఎం రేవంత్ వివరించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 148 మీటర్ల కంటే కొంత ఎక్కువగా ఎఫ్‌ఆర్‌ఎల్‌ను పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని సీఎం వివరించారు. ఎఫ్‌ఆర్‌ఎల్ పెరిగితే గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చుకునే వీలుందని ప్రస్తావించారు.
తుమ్మిడిహెట్టిని పూర్తిగా పక్కనపెట్టి..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో భాగంగా తొలుత తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించి, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రతిపాదించారు. అయితే అంత ఎత్తుతో కడితే.. ముంపు ఎక్కువగా ఉంటుందని మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్యే మార్గంగా మరో పరిశీలన చేపట్టే అవకాశమున్నా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం రీడిజైనింగ్ పేరిట ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. ఆదిలాబాద్‌కు నీటిని అందిస్తామంటూ 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించేందుకు 2016 ఆగస్టు 23న మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. అయినా ఈ బ్యారేజీ నిర్మాణాన్ని పక్కనపెట్టింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా హడావుడిగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 2019 నాటి వరదలతో బ్యారేజీల రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదురయ్యాయి. వాటికి శాశ్వత మరమ్మతులు చేయకపోవడంతో 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా.. అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడ్డాయి. వాటికి ఇప్పుడు మరమ్మతులు చేపట్టినా ఆశించిన స్థాయిలో నీటిని తరలించుకునే అవకాశం ఉండదని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై దృష్టిపెట్టింది.
150 మీటర్ల ఎత్తుతో కడితేనే ప్రయోజనం
తుమ్మిడిహెట్టి బ్యారేజీని కనీసం 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిపై నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంది. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి నిర్మిస్తే.. గ్రావిటీ ద్వారా సుందిళ్ల బ్యారేజీకి జలాలు వస్తాయని, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయవచ్చనే ప్రతిపాదనలను పరిశీలించింది. సుందిళ్లలో సీపేజీల కట్టడి కోసం పకడ్బందీగా గ్రౌటింగ్, ఇతర మరమ్మతులు చేయాలని.. బ్యారేజీ పక్కన ఉన్న గోలివాడ పంపుహౌస్ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయవచ్చని భావిస్తోంది. దీనితో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరం చేసింది.