Share News

తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు మార్గదర్శకం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Jun 03 , 2026 | 09:35 PM

తెలంగాణ రాష్ట్ర విత్తన రంగ విశిష్ట అనుభవం, సాధించిన ప్రగతి నైజీరియా దేశపు యువతకు ఎంతగానో ఉపయోగపడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు మార్గదర్శకం: మంత్రి తుమ్మల
Telangana Seed Sector

హైదరాబాద్, జూన్ 03: తెలంగాణ రాష్ట్ర విత్తన రంగ విశిష్ట అనుభవం, సాధించిన ప్రగతి నైజీరియా దేశపు యువతకు ఎంతగానో ఉపయోగపడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (IPE) వేదికగా జరిగిన అంతర్జాతీయ విత్తన శిక్షణ ముగింపు కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నైజీరియాలోని టరాబా రాష్ట్రానికి చెందిన యువతకు వారు శిక్షణా సర్టిఫికెట్లను అందజేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈ శిక్షణలో భాగంగా నైజీరియా యువతకు విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ వంటి కీలకమైన అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం, విత్తన రంగాల్లో తెలంగాణ, రాబా రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో రైతులకు శిక్షణ ఇవ్వడం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం వంటి రంగాలలో కూడా పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగానే తెలంగాణ–టరాబా రాష్ట్రాల మధ్య ‘స్టర్ స్టేట్’ఒప్పందంపై ప్రాథమిక చర్చలు జరిగాయని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ విత్తన రంగం సాధించిన ప్రగతితో యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇక్కడి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ద్వారా నైజీరియా యువత ఎంతో విలువైన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకున్నారని అభినందించారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కారం

తానా మిడ్ అట్లాంటిక్ బ్లడ్ డ్రైవ్‌కు మంచి స్పందన

Updated Date - Jun 03 , 2026 | 09:54 PM