Share News

రూ.6,631 కోట్లు

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:52 AM

రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించడం, రైస్‌మిల్లర్లు వాటిని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా.. తమకిచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకోవడం...

రూ.6,631 కోట్లు

  • సర్కారుకు రైస్‌ మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలివి..

  • బీఆర్‌ఎస్‌ హయాం నుంచి ఉన్నవి 4,939 కోట్లు

  • కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనివి 1,692 కోట్లు

  • బకాయిల జాబితాలో రాష్ట్రంలోని 2,388 మిల్లులు

  • బియ్యం ఇవ్వరు.. డబ్బులు చెల్లించరు

  • పన్నెండేళ్లుగా ఇదే తీరు.. కేసులు పెట్టినా,

  • జైలుకు పంపినా, ఆస్తులు జప్తుచేసినా.. జాన్తానై

  • ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే

  • అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వైనం

  • ఉక్కుపాదం మోపాలని సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించడం, రైస్‌మిల్లర్లు వాటిని మర ఆడించి బియ్యం ఇవ్వకుండా.. తమకిచ్చిన ధాన్యాన్ని ఇచ్చినట్లే అమ్ముకోవడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిపోయింది. ఏ సీజన్‌లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి అదే సీజన్‌లో బియ్యాన్ని వసూలు చేయడంలో ప్రభుత్వాలు, పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. రైస్‌మిల్లర్ల అక్రమ దందాకు ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు సహకరిస్తున్నారు. దీంతో మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పుష్కర కాలం (12 ఏళ్ల) నుంచి మొండి బకాయిలు పేరుకుపోయాయి. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను ప్రభుత్వానికి అప్పజెప్పకుండా, మింగిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా రైస్‌మిల్లర్లు దొంగాట ఆడుతున్నారు. కేసులు నమోదు చేసినా, జైలుకు పంపినా, ఆస్తులు జప్తు చేసినా.. జాన్తా నై అంటూ ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లర్ల పాత బకాయిలు రూ.6,631 కోట్లు ఉండగా.. వీటిని చెల్లించడానికి మొండికేస్తున్నారు. వాస్తవానికి రైస్‌మిల్లర్ల దందా ఈనాటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కొంత మేరకు జరిగినా.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హద్దులు మీరిపోయారు. 2014-15 సీజన్‌ నుంచి మొదలుకొని ఇప్పటివరకు అక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. రైతుల నుంచి ధాన్యా న్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొని.. రైస్‌మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చేందుకు కేవలం జాబ్‌వర్క్‌ (అద్దెపని) మాత్ర మే చేయాలి. ఇందుకుగాను ప్రభుత్వం మిల్లింగ్‌ చార్జీలు చెల్లిస్తుంది. వాటితోపాటు ఉప ఉత్పత్తులు (తౌడు, పరం, పొట్టు, నూకలు) కూడా మిల్లర్లకే ఇస్తారు. 100 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తే 67-68 కిలోల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. అంతే తప్ప.. వడ్లు గానీ, బియ్యం గానీ అమ్ముకునే అధికారం రైస్‌మిల్లర్లకు లేదు. ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత గడువులో ధాన్యాన్ని మర ఆడించి బియ్యం అప్పజెప్పాలి. మరో విషయం ఏమిటంటే.. రైతులకు చెల్లించే ధాన్యం డబ్బులను ప్రభుత్వం బ్యాంకుల్లో అప్పు తెస్తుంది. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించిన తరువాత.. ఎఫ్‌సీఐ ఇచ్చే డబ్బులను తిరిగి బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్రక్రియ కొన్నేళ్లుగా రాష్ట్రంలో గాడి తప్పింది. ముఖ్యంగా గత ప్రభుత్వం రైస్‌మిల్లర్లకు ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వటంతో అక్రమాలు హద్దులు దాటాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించారు. అంగడి సరుకుగా చేసి అమ్ముకున్నారు. కొందరు బియ్యం ఎగుమతులు చేశారు. జంకు లేకుండా అడ్డగోలుగా కోట్లకు కోట్లు దండుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. సినిమాలు, షార్ట్‌ ఫిల్ములు తీశారు.


జైలుకు పంపినా జాన్తా నై..

మిల్లర్ల వద్ద మొత్తంగా రూ.6,631 కోట్ల బకాయిలున్నాయి. ఇందులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన బకాయిలు రూ.4,939 కోట్లు కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో బకాయి పడ్డవి రూ.1,692 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,388 రైస్‌మిల్లులు సీఎంఆర్‌ బకాయిల జాబితాలో ఉన్నాయి. వారు ఎంతకీ బకాయిలు చెల్లించకపోవడంతో.. ప్రభుత్వం ఇటీవల కొందరు రైస్‌ మిల్లర్లపై కేసులు నమోదు చేసింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో దాడులు చేయిస్తోంది. అయితే ఓవైపు కేసులు నమోదవుతున్నా, రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ ద్వారా ఆస్తులను జప్తు చేస్తున్నా, క్రిమినల్‌ కేసులు, పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపుతున్నా.. మిల్లర్లకు చీమ కుట్టినట్లు కూడా కావడంలేదు. రూ.132 కోట్ల ధాన్యం కాజేసిన పెద్దపల్లికి చెందిన ఒక రైస్‌మిల్లర్‌పై ఇటీవల పీడీ యాక్టు పెట్టి చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు పంపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఇద్దరు రైస్‌మిల్లర్లు రూ.218 కోట్ల బకాయిలు పడితే.. క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పీడీఎస్‌ బియ్యాన్ని రీ-సైక్లింగ్‌ చేసిన మరో 11 మంది రైస్‌మిల్లర్లపై పీడీ యాక్టులు నమోదు చేసి.. రూ.20 కోట్ల విలువైన బియ్యం, రూ.17 కోట్ల విలువైన వాహనాలు సీజ్‌ చేశారు. ధాన్యం అక్రమ రవాణా చేసిన 348 మంది రైస్‌మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు, 128 మంది మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్టు నమోదు చేశారు. కానీ, రైస్‌ మిల్లర్లు మాత్రం ‘జైలుకు పోతాం... బెయిలుపై వస్తాం!’ అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

111-Sports.jpg

ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం

ధాన్యం, బియ్యం బకాయిలపై ప్రభుత్వం ఇటీవల దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాజాగా అధికారులతో సమీక్షలు నిర్వహించారు. రైస్‌మిల్లర్ల నుంచి బకాయిలన్నీ రాబట్టాలని, పక్కా ప్రణాళిక రూపొందించి ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దీంతో కొద్దిరోజులుగా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. గడిచిన రెండు సీజన్లలో (2025-26 ఖరీఫ్‌, రబీ) ఇచ్చిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయా? లేదా? అని జల్లెడ పడుతున్నారు. కేసులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 06:55 AM