పౌల్ట్రీ పరిశ్రమకు ప్రాధాన్యత రంగం హోదా.. కొత్త పాలసీలు తెస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:37 PM
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబరు 25: నగరంలోని హెచ్ఐసీసీలో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈశ్వర్ కుమార్, రాజ్ కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మాల్ రెడ్డి రాంరెడ్డి, శివసేనారెడ్డి, పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిరోజూ 5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తూ విద్యార్థులు, యువతకు పౌష్టికాహారం అందించడంలో పౌల్ట్రీ వ్యాపారులు కీలక భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకు ఎదురవుతున్న సమస్యలను పరిశ్రమ ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతూ పలు ప్రతిపాదనలు అందించారని తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ యూనిట్ల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసేలా అవసరమైన మార్పులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లు, గుడ్ల ఉత్పత్తికే పరిమితం కాదని, రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రెండేళ్లకు సరిపడా సన్నబియ్యం నిల్వలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. అయితే.. పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన మొక్కజొన్న కొరత అంశం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రులను ఆదేశించారు. పౌల్ట్రీ రంగాన్ని కూడా ప్రాధాన్యత రంగంగా గుర్తించి, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యేక విధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
Also Read:
విశ్వసుందరిగా ప్యూర్టోరికో భామ.. జెన్నిఫర్ బారెటోకు కిరీటం!
యువీ ఇచ్చిన సలహాలతో చెలరేగిపోయా: వైభవ్
కీలక పరిణామం.. దలై లామాకు కేంద్ర ప్రభుత్వ భవనం కేటాయింపు