Share News

పోలీస్ భద్రతపై సంచలన సమీక్ష.. వీఐపీ వాహనాల తొలగింపు!

ABN , Publish Date - Jul 02 , 2026 | 06:16 PM

తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా సమీక్షలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్‌లను పూర్తిగా తొలగించింది.

పోలీస్ భద్రతపై సంచలన సమీక్ష.. వీఐపీ వాహనాల తొలగింపు!
Telangana Police

హైదరాబాద్, జులై 2: మాజీ డీజీపీలు, కీలక అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్‌ల తొలగిస్తున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న ఉన్నతాధికారులకు కేటాయించిన భద్రతను భారీగా కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సుమారు 20 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న కొందరు అధికారుల బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ పూర్తిగా తొలగించింది. భద్రతా సమీక్ష అనంతరం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కోల్పోయిన వారిలో ప్రముఖ మాజీ డీజీపీలు స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మలతో పాటు పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డీటీ నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా వంటి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సైతం పోలీస్ శాఖ ఉపసంహరించుకుంది.

కేవలం వాహనాలే కాకుండా మాజీ డీజీపీలకు ఇన్నాళ్లూ కొనసాగిన ఎస్కార్ట్ వాహనాలను కూడా పూర్తిగా తీసివేశారు. ఈ భద్రత కుదింపు కేవలం పోలీస్ అధికారులకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీస్ అధికారులకు కేటాయించిన గన్ మెన్ల సంఖ్యను కూడా పోలీస్ శాఖ భారీగా తగ్గించింది. విరివిగా ఉన్న గన్ మెన్ల భద్రతను చాలా వరకు కేవలం 'వన్ ప్లస్ వన్' కే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో భద్రతా అవసరాలు, ముప్పు తీవ్రతను అంచనా వేసిన తర్వాతే ఈ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ బోడుప్పల్‌లో భూ పోరాటం.. కవిత అరెస్ట్

‘మీ అవినీతిని మాకు అంటించాలని చూస్తున్నారా’.. బీఆర్‌ఎస్‌పై పొంగులేటి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 07:13 PM