Share News

ఆర్నెల్లకో ఆస్పత్రి

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:48 AM

వచ్చే ఏడాది డిసెంబరు 9వ తేదీలోగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రులన్నీ పూర్తిచేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు....

ఆర్నెల్లకో ఆస్పత్రి

  • వచ్చే ఏడాది డిసెంబరు 9 నాటికి అన్నీ పూర్తి చేస్తాం

  • ఉస్మానియా, మరో 3 అందుబాటులోకి తెస్తాం

  • పేదల ఆరోగ్యం మా బాధ్యతగా భావిస్తున్నాం

  • కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా నిర్వహిస్తాం

  • ఆస్పత్రులు మీరే కడితే ఎందుకు ప్రారంభించలేదు?

  • కేసీఆర్‌ టెంకాయ కొట్టి నిధులు, నిర్మాణం మరిచారు

  • చెన్నారెడ్డి టిమ్స్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌

  • టీజీ సేఫ్‌, ఆరోగ్య దీపిక పాలీ క్లినిక్‌ సేవలు షురూ

  • బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.70 కోట్లే..

  • మేం ఇచ్చింది రూ.845 కోట్లు: డిప్యూటీ సీఎం భట్టి

  • సనత్‌నగర్‌ టిమ్స్‌లో మెడికల్‌ పీజీ కళాశాల

  • ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది డిసెంబరు 9వ తేదీలోగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రులన్నీ పూర్తిచేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రితోపాటు అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులను ప్రతీ ఆరు నెలలకు ఒకటి చొప్పున ప్రారంభిస్తామన్నారు. సోమవారం ఆయన సనత్‌ నగర్‌లో నిర్మించిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆస్పత్రి అంతా తిరుగుతూ వారితో ఒక్కో బ్లాక్‌ ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఆయన సురక్షితమైన ఆహారం, నాణ్యమైన మందులే లక్ష్యంగా పనిచేసే ’టీజీ సేఫ్‌’ అనే వ్యవస్థను, క్యూర్‌ పరిధిలో 145 అర్బన్‌ పీహెచ్‌సీలను ఆరోగ్య దీపిక పాలీ క్లీనిక్‌లుగా బలోపేతం చేస్తూ సేవలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌ టీమ్స్‌లు, వరంగల్‌, ఉస్మానియా ఆస్పత్రులు తామే కట్టినట్లుగా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ప్రస్తావించారు. మీరే కడితే రిబ్బన్‌ కట్‌ చేయనికి సమయం దొరకలేదా? అని ఎద్దేవా చేశారు. పదేళ్లు చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా, హరీశ్‌ ఆరోగ్య మంత్రిగా ఉన్నారు కదా? మీరు ఎందుకు వాటిని ప్రారంభించలేక పోయారు? అని ప్రశ్నించారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్వీర్యం చేసి కూల్చాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తే గోషామహల్‌లో 30 ఎకరాలలో రూ.2,700 కోట్లతో 2 వేల పడకల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ని తాము నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సనత్‌ నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌ టీమ్స్‌లకు, వరంగల్‌ ఆసుపత్రికి బీఆర్‌ఎస్‌ వాళ్లు టెంకాయలు కొట్టి నిధులు, నిర్మాణం మరిచి పోయారంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ పగటి వేషగాడిలాగా టిమ్స్‌కు వచ్చి తాము కష్టపడి కడితే రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నాడని ఆరోపణలు చేశారని ప్రస్తావించారు.


బీఆర్‌ఎస్‌ వాళ్లు జీఓలిచ్చి టెంకాయలు మాత్రమే కొట్టి ఫామ్‌హౌ్‌సలు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వెయ్యి ఎకరాల్లో ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌ కట్టుకుంటే ఒక్క రోజైనా ఆలస్యమైందా? జన్వాడలో వంద ఎకరాల్లో వైట్‌ హౌస్‌ లాంటి ఫార్మ్‌హౌస్‌ కట్టుకున్నావ్‌ ఒక్క రోజైనా ఆలస్యమైందా.? మీ చెల్లెలు శంకరపల్లిలో, మీ బావ మోయినాబాద్‌లో ఫార్మ్‌హౌ్‌సలు కట్టుకున్నారు ఎప్పుడైనా ఆగాయా? అని ప్రశ్నించారు. పేదలకు అందించే ఒక్క హాస్పిటల్‌ను పదేళ్లలో కట్టి ప్రారంభించారా? ఆత్మపరిశీలన చేసుకోకుండా, సమాజం గమనిస్తుందన్న సిగ్గు కూడా లేకుండా నోటికివచ్చిన అబద్ధాలతో బతకాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబం సంపాదించిన లక్ష కోట్ల రూపాయల్లో వెనుకబడిన నియోజకవర్గాల అభివృద్ధికి కనీసం 10-20 కోట్లు ఖర్చు పెడితే చేసిన పాపాలు కొంతైనా తగ్గుతాయని అన్నారు. సోషల్‌ మీడియా ప్రచారంతో, బంట్రోతులు కట్టే ఫ్లెక్సీలతో ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మరని అన్నారు. 2034 వరకు కేసీఆర్‌ కుటుంబం ఆత్మపరిశీలన లేకుండా ఇలాగే ఉండాలని తాను కోరుకుంటానని, అప్పుడే తన పని సులువు అవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నర్సింగ్‌ విద్యను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని, జర్మనీ, జపనీస్‌, కొరియన్‌ భాషలు నేర్చుకుంటే ఆయా దేశాల్లో లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు. పేదల వైద్యాన్ని ప్రభుత్వం తమ బాధ్యతగా భావించిందని, అందుకే, గతంలో ఎన్నడూ లేనివిధఃగా 16 వేల వైద్య నియమకాలు చేపట్టామని తెలిపారు. పేదలు కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్నది తన అభిమతమని చెప్పారు. పేదలకు కూడా అవయవ మార్పిడి సాధ్యం చేస్తూ ఎంసీఆర్‌ టీమ్స్‌లో ఆ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖకు రూ.13 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించుకున్నా ఖర్చు మాత్రం రూ.21,800 కోట్లు చేస్తున్నామని వివరించారు. ఉస్మానియా, వరంగల్‌ ఆస్పత్రులు, సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌ టిమ్స్‌లకు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ ఆస్పత్రులన్నీ పూర్తయ్యితే 10 వేల పడకలు పేదలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్పొరేట్లు కూడా ప్రభుత్వ ఆస్పత్రులతో పోటీ పడలేని విధంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఒక్కో ఆస్పత్రికి ఒక్కో డైరెక్టర్‌ను నియమించి నిమ్స్‌కు పోటీగా నడిపిస్తామన్నారు. నిమ్స్‌ ఆస్పత్రి నేడు ఎయిమ్స్‌ ఆసుపత్రితో పోటీ పడి సేవలు అందిస్తోందని చెప్పారు. అపోలో, యశోద, ఏఐజీతో పోటీగా శుభ్రతను పాటించేందుకు భారీగా నిధులు ఇస్తామని ప్రకటించారు. టిమ్స్‌లో రోగుల సహాయకులకు మంచి ఆహారం, నిద్రకు మంచి డార్మెటరీస్‌ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని చెప్పారు. టిమ్స్‌లో సూపర్‌ పీజీని కూడా మంజూరు చేయాలని చెప్పారు.


ఎక్కువ పని చేస్తే ప్రోత్సాహకాలు

ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు ఎక్కువగా ప్రయివేటు ఆసుపత్రులకే వెళ్తున్నాయని, ఇక ప్రభుత్వ డాక్టర్లు అదనపు సమయానిచ్చి ఎక్కువ సర్జరీలు చేస్తే ఇన్సెంటివ్‌లు ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రైవేటు ప్రాక్టీస్‌ కోసం వాడుతున్న అదనపు సమయాన్ని ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు నమ్మకం కల్పిస్తే మన జన్మ సార్ధకమైనట్టేనని తెలిపారు. పిల్లలకు 12వ తరగతి తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే ఏ సంక్షేమ పథకం వాళ్లకు ఇవ్వాల్సిన పని లేదని, వాళ్ళే సొంతంగా బతుకుతారని వ్యాఖ్యానించారు. ఎవ్వరూ ఇష్టంతో సంక్షేమ పథకాలను తీసుకోరని, కష్టం వచ్చినప్పుడు మాత్రమే కోరుకుంటారని చెప్పారు. సంక్షేమ పథకాలను తగ్గించాలనుకుంటే ప్రభుత్వాలు ప్రజలను సొంత కాళ్ల మీద బతికేట్లు చేయాలన్నారు. సాయంత్రం 6 గంటలకు టిమ్స్‌కు చేరుకున్న సీఎం అరగంట సేపు ఆస్పత్రిలో కలియతిరిగారు. వైద్య సేవలు, చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ, ఐపీ, ఆపరేషన్‌ థియేటర్లు, ఆన్‌లైన్‌ సేవలు, రోగుల రిజిస్ట్రేషన్ల గురించి వైద్యులు సీఎంకు వివరించారు. ఆధునిక వైద్య పరికరాల పనితీరును సీఎం పరిశీలించారు. నర్సింగ్‌ స్టాప్‌తో కాసేపు మాట్లాడారు. వైద్య సిబ్బందితో సీఎం కరచాలనం చేశారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 07:37 AM