Share News

తెలంగాణలో మిగిలిన మున్సిపల్ పీఠాల కోసం ఎత్తుకు పైఎత్తులు.. అప్డేట్స్

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:50 AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం, మేయర్, చైర్మన్ పీఠాల ప్రమాణ స్వీకారం నిన్న చాలా వరకూ పూర్తయింది. అయితే, ఇంకా కొలిక్కిరాని చోట్ల పీఠాల్ని దక్కించుకునేందుకు రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

తెలంగాణలో మిగిలిన మున్సిపల్ పీఠాల కోసం ఎత్తుకు పైఎత్తులు.. అప్డేట్స్
Telangana Municipal Posts

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 17: తెలంగాణలోని మిగిలి ఉన్న మున్సిపల్ పీఠాలపై పట్టు కోసం ప్రధాన పార్టీల మధ్య మైండ్ గేమ్ ఇవాళ పీక్స్‌కి చేరుతోంది. మ్యాజిక్ ఫిగర్ కోసం స్వతంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో హస్తం, కారు, కమలం నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఆ అప్డేట్స్ మీకోసం..


కొమురం భీం: కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఉత్కంఠ

కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. ఈ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్-బీజేపీలు ఓ అవగాహకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్-బీజేపీ కూటమి వైపు 18 ఓట్లు (కాంగ్రెస్-9, బీజేపీ-5, ఇండిపెండెంట్లు-2, 1 ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్సీ ఎక్స్ అఫీషియో ఓట్లు) ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ 11, ఎంఐఎం 1, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్-బీజేపీదే పైచేయిగా ఉంది. ఈ రెండు పార్టీలు సంయుక్తంగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం దక్కింది.


సంగారెడ్డి జిల్లా: ఇంద్రేశం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ ప్లాన్

ఇంద్రేశం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మున్సిపాలిటీలోని 18 వార్డులకు 9 బీఆర్ఎస్, 6 కాంగ్రెస్ , 2 బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే బీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ సైతం బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో సునాయాసంగా బీఆర్ఎస్‌కు చైర్మన్ పీఠం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్‌కు మద్దతు తెలిపినందుకు బీజేపీకి వైస్ చైర్మన్ పదవి దక్కనుంది.


ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు తొర్రూర్, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు తొర్రూర్, జనగామ, డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఇవాళ జరుగుబోతోంది. నిన్నటి గొడవ నేపథ్యంలో తొర్రూరులో భారీగా పోలీసులు మోహరించారు. భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. తొర్రూర్ వాసులు ఎవరూ గుంపులుగా బయట తిరగవొద్దని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.


మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద భారీ పోలీసు బందోబస్త్

మంచిర్యాలలో నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ వద్ద ఇవాళ భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. అనుమతి లేని వ్యక్తులు మున్సిపల్ కార్యాలయం వైపు రావొద్దని పోలీసుల సూచనలు జారీచేశారు.


పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేడు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఇవాళ తేలే సూచనలు కనిపిస్తు్న్నాయి. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పీఠం కోసం తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో సమావేశంలోనే సీల్డు కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లు వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆశావహులు చైర్మన్‌గిరి కోసం ఇప్పటికే బంపర్ ఆఫర్లు ప్రకటిన సంగతి తెలిసిందే.


జహీరాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జహీరాబాద్ మునిసిపాలిటీలోని మొత్తం 37 వార్డు స్థానాల్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, ఎంఐఎం 2, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలుపొందారు. ఎక్స్అఫిషియోగా బీఆర్ఎస్‌కు స్థానిక ఎమ్మెల్యే మానిక్ రావు, కాంగ్రెస్‌కు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు బీఆర్ఎస్‌కు ఇద్దరు, కాంగ్రెస్‌కు ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంది. దీంతో స్వతంత్రులు, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు కీలకంగా మారారు. జహీరాబాద్‌లో స్వతంత్రుల సహకారంతో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు, స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది.


మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీలో పోలీసుల ఆంక్షలు..  పికెటింగ్‌లు ఏర్పాటు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో పోలీసులు ఆంక్షలు విధించారు. మున్సిపల్ కార్యాలయం వెళ్లే రహదారుల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. బయట వ్యక్తులు మున్సిపాలిటీ కార్యాలయం వైపు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇక, క్యాతనపల్లిలో కాంగ్రెస్ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రంగంలోకి దిగారు. చైర్మన్ ఎన్నిక సందర్బంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.

అటు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికి బీఆర్‌ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి చేరుకున్నారు.


మాజీమంత్రి, బీఆర్ఎస్ మహిళా నేత సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్

మహబూబాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ధర్నాకు బయలు దేరిన సత్యవతి రాథోడ్ బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


మంచిర్యాల : క్యాతనపల్లి మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఈ ఉదయం నుంచీ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ కోడలు, 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను కిడ్నాప్ చేశారని ఆమె అత్త లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కౌన్సిలర్ స్వర్ణలత దంపతులు కొద్ది రోజులుగా బీఆర్ఎస్ శిబిరంలో ఉన్నారు. ఇలా ఉండగా, భారీ బందోబస్త్ మధ్య క్యాతనపల్లి మున్సిపాలిటీకి10 మంది బీఆర్ఎస్, నలుగురు సీపీఐ కౌన్సిలర్లు చేరుకున్నారు.


మంచిర్యాల: క్యాతనపల్లిలో లాఠీచార్జ్

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను క్యాతనపల్లి మున్సిపాలిటీ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అనుచరులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. పరిస్థితి చేజారుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.

మరోవైపు, మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ క్యాతనపల్లి మున్సిపాలిటీకి చేరుకున్నారు. మంత్రితో కలిసి కౌన్సిల్ హాల్‌కు ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా వచ్చారు.


జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిన సమీకరణాలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో కాసేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరుగబోతోంది. ఈ ఉదయం నుంచి సమీకరణాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. మొత్తం 37 వార్డుల్లో 14 కాంగ్రెస్, 15 బీఆర్‌ఎస్, 3 బీజేపీ, 2 ఎంఐఎం, 3 స్వతంత్రులు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియోతో బీఆర్ఎస్ బలం 16 చేరింది. మ్యాజిక్ ఫిగర్ 19 కాగా.. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ఎక్స్ అఫిషియోగా ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, మున్సిపల్‌ ఆఫీస్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ, భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.


డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఇవాళ కూడా వాయిదా పడే అవకాశం

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఇవాళ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితి ఇంకా కొలిక్కిరాలేదు. మొత్తం 15 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్ గెలువగా, 4 వార్డులు బీఆర్ఎస్ గెల్చుకుంది.


సంగారెడ్డి జిల్లా : ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం మున్సిపల్ సమావేశంలో కోరం లేక నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిన్న ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు 12 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. వీరిలో పది మంది బీఆర్ఎస్, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఇవాళ సభకు హాజరయ్యారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమీల ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా 12 వ వార్డు పట్లోళ్ల హరీష్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి..

వందే భారత్‌ స్లీపర్‌, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా పునరుద్ధరణ

రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ సమావేశం

Updated Date - Feb 17 , 2026 | 01:59 PM