వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా పునరుద్ధరణ
ABN , Publish Date - Feb 16 , 2026 | 08:24 PM
వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ బెర్త్‌ల కేటాయింపు విధానాన్ని పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ ట్రెయిన్స్‌లో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ పునరుద్ధరించింది. గతంలో ఈ రైళ్లల్లో మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు అందుబాటులో ఉండేవి. అయితే, ప్యాసెంజర్ల అవసరాలు, బెర్తుల లభ్యత, కార్యనిర్వహణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను పునరుద్ధరించేందుకు నిర్ణయించింది.
అత్యవసర జర్నీలకు అనుగుణంగా ఎమర్జెన్సీ కోటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అన్ని జోనల్ శాఖలను ఆదేశించింది. ఇందుకు సంబంధించి సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఏడు లేదా అంత కంటే ఎక్కువ స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్న అమృత్ భారత్ రైళ్లల్లో ఇరవై నాలుగు ఎమర్జెన్సీ బెర్తులను అందుబాటులో ఉంచాలి. ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లల్లోని ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీల్లో సాధారణ రోజుల్లో నాలుగు ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంచాలి. వారాంతాల్లో ఆరు ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక సెకెండ్ క్లాస్ ఏసీ కోచ్‌లల్లో సాధారణ రోజుల్లో ఇరవై నాలుగు బెర్తులు, వారాంతాల్లో 30 బెర్తులు అందుబాటులో ఉంచాలి. ఇక థర్డ్ క్లాస్ ఏసీ బోగీల్లో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 42 బెర్తులు ఎమర్జెన్సీ కేటగిరీగా అందుబాటులో ఉంచాలి.
ఎవరికీ ఎమర్జెన్సీ కోటా
నిబంధనల మేరకు అత్యవసరమైన సందర్భాల్లో ప్రయాణించేందుకు ఈ కోటాను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీలు, అధికారిక విధుల్లో భాగంగా అత్యవసర ప్రయాణాలు, కుటుంబ ఎమర్జెన్సీలు తలెత్తినప్పుడు వీటిని వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఉన్నతాధికారులు ఈ కోటాను వినియోగిస్తారు. అయితే, సాధారణ ప్రయాణికులు కూడా తగు డాక్యుమెంట్స్‌తో ఈ కోటాలో జర్నీ చేయొచ్చు. ఈ ఎమర్జెన్సీ బెర్తులను బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ సదుపాయం లేదు. జర్నీకి కనీసం ఒక రోజు ముందు సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. అన్ని తనిఖీలూ పూర్తయ్యాకే అనుమతి జారీ అవుతుంది.