ప్రజల ముంగిటకే ‘మీ సేవ’లు: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:42 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీ సేవ కేంద్రాలకు వెళ్లకుండానే ఇంటి వద్ద నుంచే పలు పౌర సేవలను పొందే అవకాశం కల్పించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 23: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, చేరువగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్’ను ప్రారంభించింది. మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 108 ప్రభుత్వ మీ సేవ కేంద్రాలతో పాటు 5,400కు పైగా ప్రైవేట్ మీ సేవ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రజల్లో మీ సేవ కేంద్రాలపై ఉన్న నమ్మకమే వాటి వినియోగానికి ప్రధాన కారణమన్నారు. భవిష్యత్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మీ సేవ కేంద్రాల సంఖ్యను మరింత పెంచుతామని, వాటిని తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇకపై ప్రజలు మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం లేదా మీ సేవ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఇంటి వద్ద నుంచే సేవలు పొందే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
డోర్ డెలివరీ విధానంలో భాగంగా మీ సేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా ఇంటికి వచ్చి అవసరమైన సేవలను అందించనున్నారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, ఈసీ కాపీలు, పోలీస్ శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు తదితర కీలక పౌర సేవలను ఇంటి వద్దకే అందించనున్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు.. వీఎల్‌ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలిదశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి.. అనంతరం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సేవలను విస్తరించనున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు అనుకూలమైన ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ముందుకు సాగుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు