తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:05 PM
తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్ నియామకం అయ్యారు. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా సజ్జనర్ బదిలీ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. కీలక పోస్టుల్లో కొత్త అధికారులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ నియమితులయ్యారు.
ఇప్పటి వరకు హైదరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వహించిన వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేసింది. అలాగే జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా, మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీగా సౌమ్య మిశ్రాకు బాధ్యతలు అప్పగించింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకేసారి ఇంతమంది కీలక అధికారులకు స్థానచలనం కల్పించడంతో పోలీస్ శాఖలో ఈ బదిలీలు చర్చనీయాంశంగా మారాయి.
ఇక ఇతర కీలక విభాగాల్లోనూ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించగా, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్‌ను నియమించింది. సివిల్ సప్లైస్ కమిషనర్‌గా నాగిరెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఆకున్ సబర్వాల్‌ను నియమించగా, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విభాగం బాధ్యతలను స్టీఫెన్ రవీంద్రకు అప్పగించింది. మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయను నియమించింది. మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్‌కు అదనపు బాధ్యతలు కేటాయించింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించి బదిలీలు, కొత్త పోస్టింగ్స్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో కీలక విభాగాల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే బదిలీ ఉత్తర్వుల్లోని పూర్తి వివరాలు, బాధ్యతల స్వీకరణపై అధికారిక ప్రకటనలను అనుసరించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్
ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం