Share News

ఆ గట్టునుంటారా ఈ గట్టుకొస్తారా..!!

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:32 AM

మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు నేడు (సోమవారం) ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. అయితే, హంగ్‌ నెలకొన్న మునిసిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఎవరికి దక్కుతాయి.....

ఆ గట్టునుంటారా  ఈ గట్టుకొస్తారా..!!

  • హంగ్‌ మునిసిపాలిటీల్లో వేడెక్కిన రాజకీయం

  • చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులపై వీడని ఉత్కంఠ

  • కౌన్సిలర్లను తమవైపు తిప్పుకొనేందుకు యత్నాలు

  • క్యాంపు రాజకీయాలు, కొనసాగుతున్న బేరసారాలు

  • పలు చోట్ల కీలకంగా స్వతంత్రులు, ఎక్స్‌అఫీషియోలు

  • జనగామలో వైస్‌ చైర్మన్‌, కారు, 2కోట్ల నగదు ఆఫర్లు

  • కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు హస్తం గాలం?

  • జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌, జీవన్‌ రెడ్డి వర్గపోరు

  • పాలకవర్గాలు కొలువుదీరేది నేడే

  • మునిసిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

  • మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు నేడు (సోమవారం) ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. అయితే, హంగ్‌ నెలకొన్న మునిసిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఎవరికి దక్కుతాయి? ఏ పార్టీ అంతిమంగా మునిసిపాలిటీని కైవసం చేసుకుంటుంది? అనే చర్చ తారాస్థాయికి చేరింది. క్యాంపు రాజకీయాలు, కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకే పార్టీలు చేస్తున్న యత్నాలు, బేరసారాలతో రాజకీయం వేడెక్కింది. ఆయా మున్సిపాలిటీల్లో చాలాచోట్ల అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ నెలకొనగా.. బీజేపీ, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. కొన్ని మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో సభ్యుడి ఓటుకు ప్రాధాన్యం సంతరించుకుంది. పదవీ ప్రమాణాలకు సమయం దగ్గర పడుతుండగా.. ఆఖరి నిమిషంలో ఏ కౌన్సిలర్‌ ఏ గట్టున ఉంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో హంగ్‌ పరిస్థితి ఏర్పడిన పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితి ఇలా ఉంది.


గద్వాల, దేవరకద్రలో కాంగ్రె్‌సకు.. అలంపూర్‌లో బీఆర్‌ఎ్‌సకు క్లియర్‌

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడగా ఇందులో గద్వాల, దేవరకద్ర మున్సిపాలిటీల్లో కాంగ్రె్‌సకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. అలంపూర్‌ను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుండగా.. నారాయణపేట, అమరచింతలో మాత్రం ఉత్కంఠ వీడటం లేదు. నారాయణపేటలోని 24 వార్డులకు బీజేపీ 11, కాంగ్రెస్‌ 7, ఎంఐఎం 2, బీఆర్‌ఎస్‌ 2, ఏఐఎ్‌ఫబీ 1, ఓ స్వతంత్ర అభ్యర్థి వార్డుల్లో గెలిచారు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌ తరపున, ఎంపీ బీజేపీ తరపున ఓటు వేసేందుకు ఎక్స్‌ అఫీషియో నమోదు చేసుకున్నారు. ఎంఐఎం, ఫార్వార్డ్‌ బ్లాకు అభ్యర్థులు, ఎక్స్‌అఫీషియో మద్దతుతో కాంగ్రెస్‌ బలం 11కి చేరింది. ఓ స్వతంత్ర అభ్యర్థి, ఎక్స్‌అఫీషియో ఓటుతో బీజేపీ బలం 13కి చేరింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కాంగ్రె్‌సకు మద్దతిస్తే కాంగ్రెస్‌ బలం కూడా 13కి చేరుతుంది. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందనే ఆసక్తి కొనసాగుతోంది. అమరచింతలో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు చెరో మూడు, సీపీఎంకు ఒకటి చొప్పున వార్డులు దక్కాయి. కాంగ్రె్‌సకు సీపీఎం మద్దతుతోపాటు మంత్రి వాకిటి శ్రీహరి ఓటు ఉండడంతో బలం ఐదుకు చేరింది. ఇంకో అభ్యర్థి మద్దతు అవసరం కాగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి.

కామారెడ్డిలో ఎడతెగని ఉత్కంఠ

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో 38 వార్డులు ఉండగా కాంగ్రె్‌సకు 17, ఎంఐఎంకు 12, బీజేపీకి 3, బీఆర్‌ఎ్‌సకి 5 సీట్లు వచ్చాయి. ఓ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 19 సీట్లు కాగా స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌ శిబిరంలో చేరగా.. ఎంఐఎం కూడా హస్తం పార్టీకి మద్దతు పలకనున్నట్టు తెలుస్తోంది. చైర్మన్‌ పదవి కాంగ్రె్‌సకు, వైస్‌ చైర్మన్‌ పదవి ఎంఐఎంకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా మ్యాజిక్‌ ఫిగర్‌ 25 సీట్లు. కాంగ్రెస్‌ నుంచి 19 మంది కౌన్సిలర్లు గెలుపొందగా స్వతంత్రులుగా గెలిచిన మరో ముగ్గురు హస్తం గూటికి చేరగా బలం 22కు చేరింది. చైర్మన్‌ పీఠం కావాలంటే మరో ముగ్గురి మద్దతు అవసరంగా బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన 11 మందిలో ముగ్గురిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు హైదరాబాద్‌లోని శిబిరంలో ఉన్నారు. ఆ పార్టీలోని ముగ్గురు కాంగ్రె్‌సతో ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ పార్టీ సంబంధిత కౌన్సిలర్లతో వీడియోలు విడుదల చేయించింది. తాము బీఆర్‌ఎ్‌సలోనే ఉంటామని వారితో చెప్పించింది. దీంతో సోమవారం ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను ప్రస్తుతం కాంగ్రెస్‌ కూటమికి 28 మంది సభ్యుల బలం ఉండగా బీజేపీకి ఎక్స్‌ అఫిషియో సభ్యులతో కలుపుకొని 23 మంది మద్దతు ఉంది. చైర్మన్‌ పీఠం దక్కాలంటే 26 మంది మద్దతు అవసరం కాగా.. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. అలాగే భైంసా మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం ఎంఐఎం, బీజేపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థితో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఎంఐఎంను స్వతంత్ర అభ్యర్థులు వ్యతిరేకించడంతో బీజేపీ రెబల్స్‌ కూటమికి ఇక్కడ ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖానాపూర్‌ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.


ఉమ్మడి మెదక్‌లో మూడు చోట్ల బీజేపీకి పట్టు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో హంగ్‌ పరిస్థితి ఏర్పడగా ఇందులో మూడు చోట్ల చైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం బీజేపీ మద్దతుపై ఆధారపడి ఉంది. నర్సాపూర్‌లో 15 వార్డులకు కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. ఇక్కడ బీజేపీ కీలకంగా మారగా.. తమకు చైర్మన్‌ పదవి ఇస్తే ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతామని ఆ పార్టీ కౌన్సిలర్లు షరతు పెట్టారు. మెదక్‌లో 32 వార్డులకు కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 15, బీజేపీ 2, బీఎస్పీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు 17 స్థానాలు కావాలి. బీఎస్పీ అభ్యర్థి కాంగ్రె్‌సలో చేరగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ ఎక్స్‌ అఫీషియో ఓటుతో ఆ పార్టీ బలం 16కు చేరింది. మరో ఓటు కోసం బీజేపీ అభ్యర్థిని అడుగుతున్నారు. బీఆర్‌ఎస్‌ కూడా ఇద్దరి మద్దతు కోసం బీజేపీతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక్కడ కూడా చైర్మన్‌ పదవి ఇస్తే మద్దతు ఇస్తామని బీజేపీ సభ్యులు షరతు పెట్టారు. ఇస్నాపూర్‌లో 26 వార్డులకు కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 12, స్వతంత్రులు నలుగురు గెలిచారు. ఓ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, ఇద్దరు స్వతంత్రులు ప్రస్తుతం కాంగ్రెస్‌ శిబిరంలో ఉండగా బలం 13కు చేరగా మరొకరి మద్దతు అవసరం. మరోపక్క బీఆర్‌ఎ్‌సలో 11 మందితోపాటు ఇద్దరు స్వతంత్రులు ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎ్‌సకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎక్స్‌ అఫీషియో ఓటు ఉండడం కలిసి రానుంది. అయితే, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తన ఓటును ఇక్కడే వినియోగించుకుంటున్నందున ఆయన నిర్ణయం కీలకం కానుంది. ఇక, జిన్నారంలో 20 స్థానాలకు బీఆర్‌ఎస్‌ 8, కాంగ్రెస్‌ 6, బీజేపీ 4, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ కూడా చైర్మన్‌ పదవి తమకు ఇస్తే మద్దతిస్తామని బీజేపీ సభ్యులు షరతు పెట్టారు. జహీరాబాద్‌లో 37 స్థానాలకు కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 15, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కాలంటే 19 మంది అవసరం. బీఆర్‌ఎ్‌సకు ఎమ్మెల్యే మాణిక్‌రావు ఓటు ఉండగా బీజేపీ మద్దతు కోసం యత్నిస్తున్నారు. కాంగ్రె్‌సకు వచ్చిన 14 సీట్లు, ఇద్దరు ఎంఐఎం అభ్యర్థులు, ముగ్గురు స్వతంత్రులతోపాటు జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌షెట్కార్‌ ఓటుతో వీరి బలం 20కి చేరనుంది. కానీ ఒక స్వతంత్ర అభ్యర్థి అటుఇటైతే పరిణామాలు మారతాయి.


జగిత్యాలలో కాంగ్రెస్‌ వర్గపోరుతో టెన్షన్‌

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను కాంగ్రె్‌సకి 10, బీఆర్‌ఎ్‌సకి 12, బీజేపీకి 4, ఫార్వర్డ్‌బ్లాక్‌కు1, ఇండిపెండెంట్లకు 3 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 16 కాగా.. బీజేపీ, ఫార్మర్డ్‌ బ్లాక్‌, స్వతంత్రుల మద్దతు కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు అనివార్యమైంది. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేవగా.. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఓ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ను కాంగ్రెస్‌ తమ వైపు తిప్పుకుంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి మరో ఇద్దరి మద్దతు కోసం కాంగ్రెస్‌ సంప్రదింపులు జరుపుతోంది. జమ్మికుంటలో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య చర్యలు జరుగుతున్నట్టు తెలిసింది. రెండు పార్టీలు రెండున్నర సంవత్సరాల చొప్పున అధికారంలో ఉండాలా ? లేక ఒకరు చైర్మన్‌, ఒకరు వైస్‌ చైర్మన్‌ పదవిని తీసుకోవాలా అనే విషయంలో చర్చలు చేస్తున్నట్టు సమాచారం. జగిత్యాలలో 50 వార్డులు ఉండగా కాంగ్రెస్‌ 23 స్థానాల్లో, బీజేపీ 6, బీఆర్‌ఎస్‌ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 15 మంది విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీకి అధిక స్థానాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోవడంతో మ్యాజిక్‌ ఫిగర్‌ 26ను అందుకోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి చెందిన రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు.. జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ల మద్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించారు. ఓ వర్గానికి చైర్మన్‌, మరో వర్గానికి వైస్‌ చైర్మన్‌ ప్రతిపాదనలను అధిష్ఠానం చేసినట్లు తెలుస్తోంది. ఇక, జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో బీజేపీ అధిక సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కలేదు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పొత్తులతో పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో కూడా చైర్మన్‌ పీఠంపై సందిగ్ధత కొనసాగుతోంది. బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు చెరి 14 సీట్లు రాగా, బీజేపీ 1, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఐదు స్థానాల్లో గెలిచారు. ఇందులో ఓ స్వతంత్ర కౌన్సిలర్‌, ఓ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఇటీవల బీఆర్‌ఎ్‌సలో చేరగా ఉత్కంఠ రేగగా.. ఇప్పుడు వారిద్దరితోపాటు బీజేపీకి చెందిన ఏకైక కౌన్సిలర్‌, మరో నలుగురు స్వతంత్రులు కూడా కాంగ్రె్‌సకే మద్దుతు ఇవ్వనున్నారని తెలిసింది. దీంతో చైర్మన్‌ పీఠం కాంగ్రె్‌సకే దక్కుతుందని అంటున్నారు.


ఆసిఫా‘బాద్‌షా’ ఎవరో?

ఆరున్నర దశాబ్దాల పాటు మేజర్‌ గ్రామ పంచాయతీగా కొనసాగి మున్సిపాలిటీగా మారిన కుమరం భీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌లో తొలిసారిగా పురపాలిక ఎన్నికలు జరిగాయి. ఆసిఫాబాద్‌లోని 20 వార్డుల్లో కాంగ్రెస్‌ ఏడు, బీఆర్‌ఎస్‌ తొమ్మిది, స్వతంత్రులు నాలుగు వార్డుల్లో గెలుపొందారు. అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో స్వతంత్రుల మద్దతు ఇరుపార్టీలకు కీలకంగా మారింది. స్వతంత్రులు ఏ పార్టీకి మద్దతు తెలిపితే ఆ పార్టీకే చైర్మన్‌ పదవి దక్కనుంది.

ఉమ్మడి రంగారెడ్డిలో ఉత్కంఠ

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మున్సిపాలిటీలోని 26 స్థానాలకుగానూ కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 7, బీజేపీ 4, స్వతంత్రులు 5 వార్డుల్లో గెలుపొందారు. ఐదుగురు స్వతంత్రులు కాంగ్రె్‌సకు మద్దతు పలుకుతున్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలోని 18వార్డులకు 8మంది కాంగ్రెస్‌, 8మంది బీఆర్‌ఎస్‌, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఇద్దరు స్వతంత్రుల్లో ఒకరు కాంగ్రెస్‌, మరొకరు బీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు ఒక్క ఓటు అవసరం కాగా పరిగి ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో ఓటుతో కాంగ్రెస్‌ ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకోనుంది. మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేటలో 24వార్డులకు 12 బీఆర్‌ఎస్‌, 8 కాంగ్రెస్‌, నలుగురు బీజేపీ నుంచి గెలిచారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదయ్యారు. మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం రాజకీయం వాడీవేడీగా సాగుతోంది. అలియాబాద్‌లో 20వార్డులకు 8 కాంగ్రెస్‌, 7 బీఆర్‌ఎస్‌, 3 బీజేపీ, ఒకటి బీఎస్పీ, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.


కీలకంగా మారిన స్వతంత్రులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు మునిసిపా లిటీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జనగామలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సకు చెరో 16 ఓట్లు ఉండగా.. ఇరుపార్టీలు చైర్మన్‌ పదవి కోసం స్వతంత్రులకు గాలం వేస్తున్నాయి. తమ శిబిరంలోకి వస్తే వైస్‌చైర్మన్‌ పదవితో పాటు కారు, రూ.2కోట్ల నగదు ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొర్రూరులో 16 వార్డులకు గాను బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 7చోట్ల గెలిచాయి. ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లతో కాంగ్రెస్‌ బలం తొమ్మిదికి పెరగ్గా.. ఇరుపార్టీలు ప్రత్యర్థి శిబిరం నుంచి ఒకరిని లాక్కునేందుకు యత్నిస్తున్నాయి. మహబూబాబాద్‌లో 36వార్డులు ఉండగా, ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. మ్యాజిక్‌ఫిగర్‌ 20కి చేరగా ఎక్స్‌అఫీషియో సభ్యుడు, సీపీఎం 3, ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ బలం ప్రస్తుతం 19కి చేరింది. అలాగే, 12వార్డుల్లో గెలిచిన బీఆర్‌ఎ్‌సకు సీపీఐ మూడు, ఓ ఎక్స్‌అఫీషియో సభ్యుడు, ఇద్దరు స్వతంత్రుల మద్దతుగా ఉండగా బలం 18గా ఉంది. స్వతంత్రుల ఊగిసలాటతో ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతోంది. కేసముద్రంలో 16వార్డుల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సకు చెరి ఎనిమిది మంది వార్డుల్లో గెలవగా మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్‌ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ బలం 9కి చేరింది. మెజారిటీకి ఒక్క ఓటు తేడా ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. వర్థన్నపేటలో 12వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 6 వార్డులు, స్వతంత్రుడితో కలిపి కాంగ్రె్‌సకు ఆరు వార్డుల బలం ఉంది. కాంగ్రె్‌సకు మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థి గోడ దూకితే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది.

Updated Date - Feb 16 , 2026 | 02:32 AM