వామ్మో వడదెబ్బ
ABN , Publish Date - May 25 , 2026 | 04:51 AM
రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండవేడిమికి తాళలేక పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ పదుల సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి.
రాష్ట్రంలో ఒక్కరోజే 42 మంది మృతి
ఒక్క ఉమ్మడి వరంగల్‌లోనే ఆదివారం17 మంది మరణం
ఉమ్మడి ఖమ్మంలో 10 మంది.. కరీంనగర్‌లో 8 మంది మృతి
నల్లగొండ జిల్లాలో ఐదుగురి కన్నుమూత
మూడు రోజుల్లో 100 మంది పైనే మృత్యువాత
పగలంతా ఎండ, వడగాలులు.. సాయంత్రం గాలివాన బీభత్సం
ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలకు తడిసిన ధాన్యం, మక్కలు
హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగానే..
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండవేడిమికి తాళలేక పిట్టల్లా రాలిపోతున్నారు. రోజూ పదుల సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో రోజూ వడదెబ్బతో 30-40 మంది వరకు మరణిస్తున్నారు. ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా 42 మంది వడదెబ్బతో మరణించారు. మరోవైపు వర్షాలు, పిడుగుపాట్లు కూడా ప్రాణాలు తీస్తున్నాయి. పగలంతా తీవ్రమైన ఎండలు, సాయంత్రం కాగానే విపరీతమైన గాలివాన భీభత్సం సృష్టిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉదయం 8-9 గంటల నుంచే మాడు పగిలే వేడి కనిపిస్తోంది. ఆదివారం రాష్ట్రంలో అనేకచోట్ల 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. సాయంత్రం కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు, వడ్లు తడిసిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే వడదెబ్బతో 17 మంది మరణించారు. వరంగల్ నగరంలోని ఉర్సు, కరీమాబాద్, ఎస్‌ఆర్‌ఆర్‌తోట ప్రాంతాలకు చెందిన ఆవునూరి రాజు (46), బేతి అశోక్ (55), చింతనూరి సరోజ(70), మైదం శ్రీను (55) వడదెబ్బతో మరణించినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన వీరగాని వీరమ్మ (84), కొత్త రామయ్య (86), తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన అత్తిలి రాము (60), టీక్యాతండాకు చెందిన జాటోత్ బీమోజీ (85), నాంచారిమడూరుకు చెందిన సోమ నారాయణ (65), కేసముద్రం స్టేషన్ బడితండాకు చెందిన అజ్మీరాలచ్యా (72), గూడూరు మండల కేంద్రంలోని చిట్యాల గడ్డకు చెందిన పాపాని ఎల్లమ్మ (68), తొర్రూరు పట్టణానికి చెందిన పైండ్ల నర్సయ్య (43), జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన తేలు పెద్ది మల్లవ్వ (70), వర్ధన్నపేటకు చెందిన చందు ఐలయ్య(88) వడ దెబ్బతో చనిపోయారు.
శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన కుక్కల సారయ్య(74) వడదెబ్బతో ఆయిల్‌పామ్ తోటలో మృతి చెందగా.. యజమాని తీరుపై ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. హసన్‌పర్తి మండల కేంద్రంలో మొలుగూరి నర్సింహరాములు (62) గేదెలను మేతకు తీసుకెళ్లి ఎండకు అస్వస్థతకు గురై మృతిచెందాడు. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో నూక సాంబయ్య (65) శనివారం వ్యవసాయ పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం ఉదయం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం వడదెబ్బతో 10 మంది చనిపోయారు. మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కొరివి అచ్చయ్య(79), నేలకొండపల్లి మండలం మూటాపురం, నేలకొండపల్లికి చెందిన నంబూరి చిన నారాయణ(45), భీమాల వెంకటేశ్వర్లు (53), ఖమ్మం నగరంలోని పాతబస్టాండ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎండదెబ్బతో మృతి చెందాడు. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన సాయి చరణ్(35), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చెందిన వంశీకృష్ణ(33), భద్రాచలంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన మాటూరి సావిత్రి (71), కండె వెంకన్న(42), చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన ఎన్.రజినీకాంత్ (36), ఖమ్మంలోని రామన్నపేటకు చెందిన గురజాల ఏడుకొండలు(50) వడదెబ్బతో ఆదివారం మృతి చెందారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం వడదెబ్బతో ఐదుగురు మరణించారు. నిడమనూరు మండలం నారాయణగూడెంకు చెందిన పల్లా నర్సిరెడ్డి (74), యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన కామిటికారి వెంకటేష్ (47), సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ఇస్తాళాపురంలో మడిపల్లి ఐలయ్య (66), కోదాడకు చెందిన ఏర్పుల శివ (40), నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో పంజాబ్‌కు చెందిన జైపాల్‌సింగ్ (36) వడదెబ్బకు మృతిచెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం వడదెబ్బతో 8 మంది మృతి చెందారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన టేకుల రాజు (45), జమ్మికుంట పట్టణంలోని శివాలయం వద్ద భిక్షాటన చేసే 65 ఏళ్ల వృద్ధుడు వడదెబ్బతో ఆదివారం చనిపోయారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన యాదగిరి కనకయ్య(60), ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన గండ్ర సత్తమ్మ(65), యైుటింక్లయిన్‌కాలనీకి చెందిన ముత్యం అశోక్(39), జగిత్యాల మండలం రాయికల్ పట్టణానికి చెందిన ఎద్దండి రాజవ్వ (85), గోదావరిఖనిలో సంపత్ (50) అనే మెకానిక్ వడదెబ్బకు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రానికి చెందిన ఆదే లోడన్న (52) వడదెబ్బతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. లోడన్న సోదరుడు గణపతి శనివారం మృతి చెందాడు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో జేవిలాల్ (46) అనే వ్యక్తి మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లిలో నరేశ్ (34) వడదెబ్బతో చనిపోయాడు.
హైదరాబాద్‌లో భగభగలు
హైదరాబాద్‌లోనూ వేసవి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఆదివారం కార్వాన్‌లో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మలక్‌పేటలో 42.6 డిగ్రీలు, ఉప్పల్, హయత్‌నగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై రద్దీ తగ్గింది. గాలిలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత పెరిగింది.
పగలంతా ఎండ.. సాయంత్రం గాలివాన
పలు జిల్లాలో పగలంతా తీవ్రమైన ఎండలు.. సాయంత్రం కాగానే గాలివాన భీభత్సం సృష్టిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అన్ని మండలాల్లో 43 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మెండోరలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పగలంతా ఎండ తీవ్రత కొనసాగింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో వర్షం కురిసింది. కృష్ణ మండలంలో అత్యధికంగా 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లాలో రెండు రోజులుగా సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడుతున్నాయి. అయినా ఎండ తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆదివారం అత్యధికంగా మదనాపురం మండలంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కజొన్న రాశులు తడిసిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం పగలంతా తీవ్రమైన ఎండలు కాయగా, రాత్రి పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని గాజులపేట గ్రామానికి చెందిన రైతు ఆనె సత్యనారాయణ పొలంలో కట్టేసి ఉన్న కాడెద్దులు సోమవారం తెల్లవారుజామున పిడుగుపాటుతో మృతి చెందాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని గుండాలకు చెందిన వావిళ్ల చిట్టెమ్మ పొలంలో కట్టేసిన పాడి ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఆదివారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, దుద్యాల్, కొడంగల్ మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. బొంరా్‌సపేట్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. దౌల్తాబాద్ మండలం దేవరఫస్లాబాద్, గోకఫస్లాబాద్, దౌల్తాబాద్, ఈర్లపల్లి, చెల్లాపూర్ గ్రామల్లో పొలాల వద్ద వడ్లు తడిసిముద్దయ్యాయి. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం వర్షానికి ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. మర్పల్లిలో రెండెకరాల అరటితోట ఈదురు గాలులుకు నేలవాలింది. బషీరాబాద్ మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో పిడుగుపడి ఒక ఆవు మృతిచెందింది.