నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:06 PM
మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతో జీవిత భీమా తీసుకువచ్చామని తెలిపారు.
హైదరాబాద్, మార్చి 22: రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతో జీవిత భీమా తీసుకువచ్చామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. తన పాదయాత్ర సమయంలో కుటుంబ పెద్దను కోల్పోయిన వారిని చూశానని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో పర్యటించే సమయంలో దయనీయమైన, నిస్సహాయమైన కుటుంబాలను చూశారని పేర్కొన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి సారి కుటుంబ జీవిత భీమా ప్రవేశపెట్టాము. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రత్యేకంగా నిధులు కేటాయించాము. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు కేటాయిస్తున్నాము. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉంటే.. కోటి 6 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రత కల్పించాము. క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఉద్యోగులకు ఇస్తున్నాము. రాష్ట్రంలో 14 వేల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి చేశాము’..
‘ప్రతి పేదవాడికి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాన్ని జోన్‌లుగా విభజించి ప్రణాళిక బద్దంగా అభివృద్ది, సంక్షేమం కొనసాగిస్తున్నాము. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాము. వరికి భోనస్ ఇస్తున్నాము. ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు హైదరాబాద్‌కు వస్తున్నాయి. ఉస్మానియా యూనివర్శిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాము. గోదావరి పుష్కరాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాము. బాసర నుంచి భద్రాచలం వరకు పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నాము. తెలంగాణలో జీవించటం అదృష్టం అనుకునే స్థాయిలో పాలన కొనసాగిస్తున్నాము’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
100కు పైగా సీట్లతో కేరళలో గెలుపు మాదే: కాంగ్రెస్
చంద్రబాబు సీఎం కావడం ఏపీ ప్రజల అదృష్టం: కేంద్ర మంత్రి కుమారస్వామి