Share News

టీ-ఫైబర్‌ నె ట్టు.. జాప్యం ఎందుకన్నట్టు?

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:32 AM

‘ఘర్‌కా ముర్గీ దాల్‌ బరాబర్‌’ అన్నట్టుగానే ఉంది టీ-ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ విషయంలో ప్రభుత్వ కార్యాలయాల తీరు! ప్రైవేటు నెట్‌ కంటే టీ-ఫైబర్‌ నెట్‌ చౌకగా లభిస్తుందనే ఉద్దేశంతో...

టీ-ఫైబర్‌ నె ట్టు.. జాప్యం ఎందుకన్నట్టు?

ఏప్రిల్‌ 1నుంచి సర్కారీ నెట్‌ కనెక్షన్‌ తీసుకోవాలన్న ఆదేశాలను పట్టించుకోని వైనం

  • ఇప్పటిదాకా 5శాతం ఆఫీసులు కూడా తీసుకోలేదు

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ‘ఘర్‌కా ముర్గీ దాల్‌ బరాబర్‌’ అన్నట్టుగానే ఉంది టీ-ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ విషయంలో ప్రభుత్వ కార్యాలయాల తీరు! ప్రైవేటు నెట్‌ కంటే టీ-ఫైబర్‌ నెట్‌ చౌకగా లభిస్తుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వ పరిధిలోని ‘టీ-ఫైబర్‌’ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకోవాలని సర్కారు గత ఫిబ్రవరిలోనే ఆదేశించినా ఆ దిశగా స్పందనే కనిపించడం లేదు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తర్వాత ప్రస్తుతం కార్యాలయాలు వినియోగిస్తున్న నెట్‌ వివరాలను విభాగాల వారీగా టీ-ఫైబర్‌కు ఇచ్చేందుకు ప్రత్యేక ఫార్మాట్‌ను కూడా సర్కారు, ఆయా కార్యాలయాలకు పంపింది. కార్యాలయాలన్నీ ప్రభుత్వ నెట్‌ కనెక్షన్‌ తీసుకోవాలన్న అంశంపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రామకృష్ణా రావును సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆదేశించారు. ఫలితంగా హుటాహుటిన ఈ అంశమ్మీద సచివాలయంలో సమీక్ష జరిపారు. అయితే మూడు నెలలు గడిచిపోయినా ప్రభుత్వ నెట్‌ కనెక్షన్‌ తీసుకోవడంలో సంబంధిత విభాగాలు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఐదు శాతం కార్యాలయాలు కూడా ప్రభుత్వ నెట్‌ కనెక్షన్‌ను తీసుకోకపోవడం గమనార్హం. ఐటీ శాఖ పరిఽధిలోని ‘టీ-ఫైబర్‌’ ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ను బహిరంగ మార్కెట్‌లో ఉన్న ప్రైవేటు సంస్థల కంటే తక్కువ ధరకే అందించేలా ధరలు నిర్ణయించారు. గతంలో సచివాలయానికి అందించే ఇంటర్నెట్‌ కోసం ఓ ప్రైవేటు సంస్థకు ఏడాదికి రూ.8 కోట్లు ఖర్చయ్యేది.. ఇప్పుడు టీ-ఫైబర్‌ ఏడాదికి రూ.88-90 లక్షలలోపే అందిస్తోందని అఽధికారికవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో 1,37,670 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కార్యాలయాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు 4,487 కార్యాలయాలు మాత్రమే టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకున్నాయి. మరో 41,152 ప్రభుత్వ విభాగాలు ఇంకా ప్రైవేటు నెట్‌నే వాడుతున్నాయి. మరో 92,031 విభాగాలకు అసలు నెట్‌ కనెక్షనే లేదు.


వీటిలో తాత్కాలిక విధానంలో సిమ్‌కార్డులకు రీచార్జి చేసి వాడుతున్నారని.. ఇందుకూ పెద్ద ఎత్తున ఖర్చవుతున్నట్టు ప్రాధమిక విచారణలో తేలిందని అధికారికవర్గాల ద్వారా తెలిసింది. 26 వేల బడులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, కొన్ని పోలీస్‌ స్టేషన్లు, పీఏసీఎ్‌సలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, పీహెచ్‌సీలు సహా ఇలా చాలా విభాగాలు తాత్కాలిక సిమ్‌కార్డు రీచార్జితోనే నెట్‌ వాడుతున్నారు. టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకున్న ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యవసాయ శాఖ, సెకండరీ ఎడ్యుకేషన్‌ విభాగం ముందు వరుసలో ఉన్నాయి. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ, పౌర సరఫరాలు, ఉన్నత విద్య, హౌసింగ్‌, కార్మిక, సంక్షేమ శాఖలు, న్యాయ విభాగం, లెజిస్లేచర్‌, ప్లానింగ్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఎస్సీ, మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల విభాగాలు అసలు కనెక్షనే తీసుకోలేదు.

చౌక ధరకే

టీ-ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకున్న 4,487 కార్యాలయాలకు కూడా గతంలో ఏడాదికి రూ.26.13కోట్లు ఖర్చయ్యేది. ఇప్పుడు రూ.13.58కోట్లకే ఆయా సంస్థలకు ప్రభుత్వ నెట్‌ అందుతోంది. అంటే దాదాపు రూ.12.55 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయినట్టు లెక్క! ఇప్పటివరకు ప్రభుత్వ పరిధిలోని సంస్థలకు ఇచ్చిన నెట్‌ కనెక్షన్‌ ద్వారా టీ-ఫైబర్‌కు సుమారు రూ.70 కోట్ల రెవెన్యూలోకి వచ్చింది. అన్ని కార్యాలయాల్లో ప్రభుత్వ నెట్‌ వినియోగంతో టీ-ఫైబర్‌కు ఏడాదికి రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 06:32 AM