Chief Minister Revanth Reddy: నల్లమల సాగర్ లింక్‌ను ఆపాల్సిందే
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:41 AM
గోదావరి నీటి వాటాలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విస్తరణ పనులను.....
సుప్రీంకోర్టులో సమర్థ వాదనలు వినిపించండి.. న్యాయ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన
ముంబైలో అభిషేక్ సింఘ్వీతో రేవంత్, ఉత్తమ్ భేటీ.. తెలంగాణ రిట్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గోదావరి నీటి వాటాలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విస్తరణ పనులను అడ్డుకునేందుకు న్యాయపోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు వినిపించాలని, ఏపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న పనులను కోర్టుకు వివరించాలని న్యాయ నిపుణులకు సీఎం సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అవసరమైన అన్ని సాంకేతిక ఆధారాలతో సిద్ధంగా ఉండాలన్నారు. కాగా, పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమల సాగర్‌కు లింక్ చేసేందుకు ఏపీ చేపడుతున్న అనుమతుల్లేని విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని రిట్ పిటిషన్‌లో ప్రభుత్వం కోరింది. మొదట ఆమోదించిన డిజైన్ మేరకు మాత్రమే పోలవరం పనులు ఉండాలని, స్వరూపాన్ని మార్చి విస్తరణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా నల్లమల సాగర్ ‘ప్రీ ఫీజిబిలిటీ’ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సరికాదని పేర్కొంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి బోర్డుకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ డీపీఆర్ తయారు చేస్తోందని, దీనికి ఎలాంటి పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదని, అలాగే కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందకుండా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కాగా, ముంబైలో సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు.