Share News

తెలంగాణ ఆర్థిక ప్రగతికి గ్లోబల్ సమ్మిట్ కీలకం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ABN , Publish Date - Sep 23 , 2026 | 09:23 PM

తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడిదారులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమలకు మార్గం సుగమం చేయడం, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతమివ్వడం లక్ష్యంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

తెలంగాణ ఆర్థిక ప్రగతికి గ్లోబల్ సమ్మిట్ కీలకం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Telangana Global Summit 2026

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని భట్టి అధికారులకు సూచించారు. ఇందుకోసం దేశ, విదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించడంతో పాటు పెట్టుబడులకు అవకాశాలున్న దేశాలు, నగరాలు, రంగాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.


సమ్మిట్ ఏర్పాట్ల పర్యవేక్షణకు దాదాపు 10 ప్రత్యేక అధికారుల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సీనియర్ అధికారులు, మంత్రులకు వివిధ బాధ్యతలు అప్పగించడంతో పాటు ప్రత్యేక వార్‌రూమ్‌ ఏర్పాటు చేసి రోజూ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో కుదిరిన ఎంవోయూల అమలు పురోగతిని సమీక్షించాలని భట్టి సూచించారు. ప్రతినిధుల స్పందనను బట్టి సభా ప్రాంగణాల సంఖ్యను 4 నుంచి 6 లేదా 8కి పెంచే అంశాన్ని పరిశీలించనున్నారు. సమ్మిట్‌ను మూడు రోజుల కార్యక్రమానికే పరిమితం కాకుండా తెలంగాణకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే వేదికగా తీర్చిదిద్దాలని భట్టి పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 09:56 PM