Share News

20 ఏళ్ల పోరాటానికి ఫలితం.. ఉపాధి హామీ ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక..

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:19 PM

ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక అందించింది. 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. మంత్రి సీతక్క చొరవతో 20 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది.

20 ఏళ్ల పోరాటానికి ఫలితం.. ఉపాధి హామీ ఎఫ్‌టీఈ ఉద్యోగులకు దసరా కానుక..
Telangana FTE employees

హైదరాబాద్, అక్టోబర్ 13: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్‌టీఈ ఉద్యోగులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం దసరా కానుక అందించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనం కల్పిస్తూ జీవో జారీ చేసింది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో దాదాపు 20 ఏళ్లుగా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల సర్వీసు, రిటైర్మెంట్‌కు సంబంధించిన నిబంధనల ప్రకారం కనీసం రూ.4 లక్షల గ్రాట్యుటీతో పాటు, పదేళ్ల సర్వీసు పూర్తిచేసే ఉద్యోగులకు రూ.10 లక్షల వరకు ప్రయోజనం లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా లభించనుంది. తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన మంత్రి సీతక్కకు ఎఫ్‌టీఈ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే గ్రాట్యుటీ మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ డిమాండ్ నెరవేరడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఉద్యోగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగులకు జీవిత చరమాంకంలో ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో గ్రాట్యుటీ మంజూరు నిర్ణయం ఎఫ్‌టీఈ ఉద్యోగులకు ఎంతో ఊరటనివ్వనుంది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తమ 20 ఏళ్ల పోరాటానికి గుర్తింపుగా నిలుస్తుందని ఉద్యోగ సంఘం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్‌ను గుర్తించి అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో భరోసాను పెంచడంతో పాటు, భవిష్యత్తులో తమ కుటుంబాల ఆర్థిక భద్రతకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి

ఇంచ్‌ గ్యాప్‌లో బయటపడ్డాడుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

సీసీటీవీ కెమరా నుంచి తప్పించుకోలేవు బ్రో.. జాగ్రత్త! వైరల్ వీడియో

Updated Date - Oct 13 , 2026 | 05:41 PM