తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పెట్టుబడుల ఆహ్వానం: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:44 AM
తెలంగాణలో వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది.
హైదరాబాద్, నవంబరు 25: తెలంగాణలో వ్యవసాయ.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్‌లో వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణపై సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ప్రతినిధులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న అనుకూల పరిస్థితులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. రాష్ట్రంలో విస్తారమైన వ్యవసాయ ఉత్పత్తులు, నాణ్యమైన ముడిసరుకు లభ్యత, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికీకరించడంతో పాటు పెట్టుబడుల ద్వారా కొత్త పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కంపెనీల ప్రతినిధులకు వివరించారు.
వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపునకు ప్రాధాన్యత..
రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పారిశ్రామిక సంస్థలు ముందుకు రావాలని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల రైతులకు మెరుగైన ధరలు, స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. ముఖ్యంగా యువతకు నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇలా వచ్చి.. అలా సెల్ ఫోన్ కొట్టేసింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. వీడియో వైరల్
పెళ్లిలో కోటి రూపాయల నగదు దండలు.. వరులకు బావ భారీ కానుక