Share News

ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌.. ఈ నెల నుంచే!

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:40 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన కొత్త ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) ఈ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ......

ఉద్యోగులకు హెల్త్‌ స్కీమ్‌.. ఈ నెల నుంచే!

  • నేడు ఈహెచ్‌ఎస్‌పై సీఎం సమీక్ష

  • ఎంప్లాయీస్‌ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కమిటీని ప్రకటించే చాన్స్‌.. మార్గదర్శకాలు కూడా..

  • రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున 50 మంది ఉద్యోగులకు కొత్త కార్డులు!

  • 7.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు ప్రయోజనం

  • నేడు సీఎస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన కొత్త ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) ఈ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఈ పథకం అమలుకానున్న నేపథ్యంలో.. ట్రస్టు కమిటీని సోమవారమే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పథకం మార్గదర్శకాలు కూడా విడుదల చేయవచ్చని తెలిసింది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్‌ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ట్రస్ట్‌కు సీఈ వోగా నియమిస్తారు. ఇక ఈహెచ్‌ఎస్‌పై సీఎం సమీక్ష నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్‌ రామకృష్ణారావు సమావేశం కానున్నారు.

అవతరణ వేడుకల్లో 50 మందికి కార్డులు!

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగులకు కొత్త ఈహెచ్‌ఎస్‌ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్టు సమాచారం. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమం వేదికపై 50 మంది ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ కార్డులు అందజేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ రోజున సాధ్యం కాకపోతే ఈ నెల 10లోపు కార్డుల పంపిణీ మొదలవుతుందని వెల్లడించాయి. కొత్త ఈహెచ్‌ఎస్‌ అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలన్నీ క్రోడీకరించడంపై ఆర్థిక శాఖ దృష్టిపెట్టింది. మే 31లోపు వివరాలన్నీ అప్‌లోడ్‌ చేయాలని గతంలోనే అన్నిశాఖలకు సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఈ వివరాల ఆధారంగానే ఈహెచ్‌ఎస్‌ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు, క్యాష్‌లెస్‌ చికిత్స సే‌వలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు దీనితో లబ్ధిపొందనున్నట్టు అంచనా.


జీతాల్లో వాటా ఇప్పటికే కట్‌!

కొత్త ఈహెచ్‌ఎస్‌ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెలా తమ వేతనాల బేసిక్‌ పేలో 1.5శాతాన్ని వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. మే నెల వేతనంలో ఈ మేరకు వాటాను ఆర్థిక శాఖ కట్‌ చేసింది. అయితే ఈహెచ్‌ఎస్‌ అమలు, ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రులు, అర్హత ప్రమాణాలు, చికిత్స ప్యాకేజీలపై మార్గదర్శకాలు విడుదల చేయకుండానే జీతాల్లో కోత ఎలా పెడతారని కొందరు ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. తొలుత వేతనాల్లో కోతపెట్టి, పథకం ట్రస్టులో సొమ్మును జమ చేశాకే ఈహెచ్‌ఎ్‌స స్కీమ్‌ అమలు ప్రారంభం అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వివరిస్తున్నారు.

విధి విధానాలు లేవు.. జీవో లేదు.. జీతాల్లో కోతలా?

  • చర్చలు జరపకుంటే ఆందోళనలు చేపడతాం.. ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక

  • ఈహెచ్‌ఎస్‌ పేరుతో ఎటువంటి ముందస్తు విధి విధానాలు ఖరారు చేయకుండానే మే నెల వేతనం నుంచి బేసిక్‌ పేలో 1.5శాతం అప్రకటిత కోత విధించడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎటువంటి చర్చలు, ఉద్యోగుల సమ్మతి లేకుండా, కనీసం జీవో కూడా విడుదల కాకముందే ఆర్థిక శాఖ ఏకపక్షంగా పే స్లిప్‌ జనరేట్‌ చేసి వేతన కోతకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌), తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌(టీఎస్‌సీపీఎస్‌ఈయూ) విమర్శించాయి. వైద్య చికిత్స అందించే ఆసుపత్రుల జాబితా ప్రకటించకుండా, భార్యాభర్తలు-పెన్షనర్ల మినహాయిపులపై స్పష్టత ఇవ్వకుండా కోత విధించడం వల్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని డీటీఎఫ్‌ నేతలు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి విమర్శించారు. కోత పెట్టిన మొత్తాన్ని తిరిగి ఖాతాల్లో జమచేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం జీతం, పెన్షన్‌ అనేవి ఆర్టికల్‌ 300ఎ కింద ఉద్యోగి ఆస్తి పరిధిలోకి వస్తాయని, ఉద్యోగి సమ్మతి లేకుండా జీతాన్ని కోయడం ఆర్టికల్‌ 21, 23 ఉల్లంఘన అవుతుందని టీఎస్‌సీపీఎస్‌ఈయూ నేతలు స్థితప్రజ్ఞ, కల్వల్‌ శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలు జరపకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - Jun 01 , 2026 | 05:37 AM